మద్యం దుకాణాల్లో వరుస దోపిడీలు

ABN , First Publish Date - 2021-12-30T06:55:16+05:30 IST

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దోపిడీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు సవాల్‌ విసురుతోంది.

మద్యం దుకాణాల్లో వరుస దోపిడీలు
గుడ్లూరులో చోరీ జరిగిన మద్యం దుకాణాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

పోలీసులకు సవాలుగా మారిన వైనం

ఆరు జిల్లాలలో 90కి పైగా  నేరాలు, 12 చోట్ల లూటీలు

నెల వ్యవధిలో మన జిల్లాలో  మూడుచోట్ల  ఘటనలు

కందుకూరు, డిసెంబరు 29 : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దోపిడీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు సవాల్‌ విసురుతోంది. కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వరుసగా దోపిడీలు చేస్తోంది. అన్నిచోట్లా నేరం జరుగుతున్న తీరు ఒకేలా ఉంది. దీంతో ఒకే ముఠా ఆ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ముఠా ఎక్కడిదన్న విషయంలో కనీసం ఆధారాలు సంపాదించలేకపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం మొదలు నెల్లూరు జిల్లా తడ వరకు గడచిన నాలుగు నెలల్లో 90 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఈ దొంగల ముఠా దోచుకుంది. వాచ్‌మన్‌ లేకుంటే దర్జాగా షట్టర్‌ పగులగొట్టి అందులోని డబ్బు, వారి అదృష్టం బాగుంటే ఖరీదైన మద్యం సీసాలు తీసుకెళుతున్నారు. వాచ్‌మన్‌ ఉండి అటకాయిస్తే అతనిని కొట్టి దోపిడీకి కూడా తెగబడుతున్నారు. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికేది నాసిరకం మద్యం కావడంతో దాని జోలికి దొంగలు పెద్దగా వెళుతున్న దాఖలాలు లేవు. కందుకూరు ప్రాంతంలో 40 రోజుల వ్యవధిలో మూడు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దోపిడీలు జరిగాయి. నవంబర్‌  మొదటివారంలో మండల కేంద్రమైన గుడ్లూరులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో దోపిడీ జరిగింది. అక్కడ వాచ్‌మన్‌ను కొట్టి దుకాణం షట్టర్లు పగులగొట్టి రమారమి రూ.2 లక్షల నగ దు దోచుకెళ్లారు. సరిగ్గా వారం క్రితం ఇదే తరహాలో వీవీ.పాలెం మండలం పోకూరు మద్యం దుకాణం వద్ద నైట్‌ వాచ్‌మన్‌ని చితక్కొట్టి దుకాణం షట్టర్‌ పగులగొట్టి రూ.1.08 లక్షలు నగదు దోచుకుపోయారు. కొన్ని మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత మూడురోజులకు కొండపి మండలం పెట్లూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇదేతరహాలో దోపిడీకి పాల్పడ్డ దొంగలు అక్కడ రూ.2.08 లక్షల నగదును దోచుకుపోయారు. ఇదే రీతిలో అన్నవరం నుంచి తడ వరకు 90 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదును దొంగలు తీసుకెళ్లగా 12 చోట్ల మాత్రం అడ్డొచ్చిన వాచ్‌మెన్‌లను కొట్టి దోపిడీలకు కూడా తెగబడ్డారు. ఈ 90 దోపిడీలను నిశితంగా పరిశీలించిన పోలీసులు జాతీయ రహదారికి దగ్గరగా దోపిడీకి అనువుగా ఉన్న దుకాణాలనే ఎంపిక చేసుకుని విజయవంతంగా తమ ప్రణాళిక అమలు చేసుకుని వెళ్తున్నారని నిర్థారణకు వచ్చారు. మన జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో మూడు దోపిడీలు జరగడంతో పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ ముఠాను పట్టుకోవడానికి ఇతర జిల్లాల పోలీసులతో కలిసి దర్యాప్తు చేయనున్నట్లు స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు.అయితే ఈ దోపిడీలపై సీరియస్‌గా దృష్టి సారించిన దాఖలాలు లేవు. 





Updated Date - 2021-12-30T06:55:16+05:30 IST