14 రోజులు... 5 నియోజకవర్గాలు

ABN , First Publish Date - 2021-11-02T06:48:53+05:30 IST

జధాని అమరావతి పరిరక్షణ కోసం జేఏసీ చేపట్టిన మహాపాదయాత్ర జిల్లాలో 14 రోజులపాటు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది.

14 రోజులు... 5 నియోజకవర్గాలు
దామచర్ల నివాసంలో సమావేశమైన టీడీపీ ముఖ్యనేతలు

జిల్లాలో అమరావతి జేఏసీ మహాపాదయాత్ర

ఈనెల 6 నుంచి 19 వరకు సాగనున్న కార్యక్రమం

స్వాగత సన్నాహాల్లో విభిన్న వర్గాలు

ఒంగోలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జేఏసీ చేపట్టిన మహాపాదయాత్ర జిల్లాలో 14 రోజులపాటు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. ఈనెల 6వతేదీ మధ్యాహ్నానికి జిల్లాలోకి ప్రవేశించే మహాపాదయాత్ర 19వతేదీ మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. అమరావతి రాజధాని పరిరక్షణ పేరుతో ఆ ప్రాంత రైతులు, కూలీలు, వివిధవర్గాల ప్రజలు పెద్దఎత్తున దాదాపు 23 నెలల నుంచి నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వెలువడలేదు. ఈ నేపఽథ్యంలో న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో 47రోజులపాటు మహాపాదయాత్రను వారు చేపట్టారు. ఉద్యమం ప్రారంభించి 683వరోజైన సోమవారం గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం కాగా వచ్చేనెల 17న తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనంతో ముగియనుంది. జేఏసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం పర్చూరు మండలం అడుసుమల్లి చేరుకునే బృందం, 19వతేదీ మధ్యాహ్నం గుడ్లూరు మండలంలో నుంచి నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి వెళ్లనుంది. మొత్తంగా జిల్లాలో సుమారు 150 కి.మీ మేర సాగనుండగా పాదయాత్ర మధ్యలో రెండురోజులపాటు జిల్లాలో బృందం సభ్యులు విశ్రాంతి తీసుకోనున్నారు. సోమవారం తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్రకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతోపాటు వామపక్షాలు, కాంగ్రెస్‌, జనసేన ఇతర పలు పార్టీలు, కార్మిక, ప్రజా, రైతుసంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. జిల్లాలో జేఏసీ మహాపాదయాత్ర విజయవంతం చేసేందుకు ఆయా పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. 


మహాపాదయాత్రను విజయవంతం చేద్దాం

టీడీపీ ముఖ్యనేతల భేటీలో నిర్ణయం

అమరావతి రాజధాని పరిరక్షణ జేఏసీ మహాపాదయాత్రకు జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ శ్రేణులంతా పాదయాత్రకు సంఘీభావంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలులో టీడీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఎం.అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, నారపుశెట్టి పాపారావు, దర్శి, వైపాలెం ఇన్‌చార్జీలు పమిడి రమేష్‌, ఎరిక్షన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పాదయాత్ర సాగే మార్గం, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 


Updated Date - 2021-11-02T06:48:53+05:30 IST