ఉత్కంఠకు తెరపడేనా..?
ABN , First Publish Date - 2021-04-30T03:19:20+05:30 IST
గతేడాది మార్చి 7వ తేదీన పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల కోసం నిరీక్షణ
శుక్రవారం హైకోర్టులో విచారణ
ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు
కొవిడ్ విధుల్లో ఉన్న అధికారుల్లోనూ టెన్షన్
బహుశా స్థానిక సంస్థల ఎన్నికలు ఇంత సుదీర్ఘంగా ఎప్పుడూ జరిగి ఉండవేమో. ఏడాదికి ముందు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. ఎన్నో అవాంతరాల తర్వాత ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగ్గా 10వ తేదీన కౌంటింగ్ జరిగి ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కానీ కోర్టులో విచారణ జరుగుతుండటంతో కౌంటింగ్‌లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు హైకోర్టులో ఫలితాల ప్రకటనపై విచారణ జరిగింది. శుక్రవారం మరోసారి విచారణ జరపనుంది. హైకోర్టు ఎటువంటి ఆదేశాలిస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నెల్లూరు (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్ 29 : గతేడాది మార్చి 7వ తేదీన పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అదే నెల 14వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆ నెల 21న ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో అప్పట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలను వాయిదా వేసింది. పరిషత్ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు జరగడం, పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో కరోనా ఉధృతి తగ్గిన అనంతరం ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. తర్వాత కొత్త ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులైన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీసం నాలుగు వారాలు ఎన్నికల కోడ్ లేకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలను నిలుపదల చేస్తూ సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఎన్నికలు జరపుకోవచ్చని కానీ ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని పోలింగ్‌కు కొన్ని గంటల ముందు తీర్పునిచ్చింది. దీంతో ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగింది. జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలకు 12 స్థానాలు, 554 ఎంపీటీసీ స్థానాలకు 188 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 34 జడ్పీటీసీ, 366 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాలకు 140 మంది, ఎంపీటీసీ స్థానాలకు 972 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంతో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. జిల్లాలో 53.52 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ఇటు అభ్యర్థులు, అటు అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో అధికార యంత్రాంగమంతా ఆ విధుల్లో నిమగ్నమైంది. అలానే వచ్చే నెల 2వ తేదీన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పరిషత్ కౌంటింగ్ చేయమని ఆదేశాలొస్తే ఏం చేయాలన్నదానిపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు.