టీడీపీ సీనియర్‌ నేత వైటీ నాయుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-10-13T05:06:01+05:30 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ ఎడుపాటి తిరుపాల్‌నాయుడు (వైటీ నాయుడు) కన్నుమూశారు.

టీడీపీ సీనియర్‌ నేత  వైటీ నాయుడు కన్నుమూత
వైటీ నాయుడు మృతదేహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు బీద రవిచంద్ర, అజీజ్‌, కోటంరెడ్డి తదితరులు

పలువురు ప్రముఖుల సంతాపం


నెల్లూరు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ ఎడుపాటి తిరుపాల్‌నాయుడు (వైటీ నాయుడు) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం నెల్లూరులో తుదిశ్వాస విడిచారు. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ఆయన టీడీపీలో కొనసాగుతూ నెల్లూరు నగరంలో కీలక నేతగా ఎదిగారు. రాజకీయాల్లోకి వచ్చాక సీపీఎం తరపున కౌన్సిలర్‌గా గెలుపొందారు. తదనంతరం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించాక అందులో చేరి పార్టీ కీలక నేతగా వైటీ నాయుడు వ్యవహరించారు. దుత్తలూరు జడ్పీటీసీగా టీడీపీ నుంచి గెలుపొందారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నెల్లూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తెలుగుదేశంలో చీలిక వచ్చాక ఏర్పాటైన అన్న ఎన్టీఆర్‌ పార్టీ తరపున నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి చెందారు. కాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా వైటీ మెలిగారు. ఈ క్రమంలోనే నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వైటీ నాయుడును ప్రకటించాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలోనే అనారోగ్యానికి గురవడంతో అప్పటినుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కాగా రెండేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన నారా చంద్రబాబునాయుడు వైటీ నాయుడు ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించారు. 


ప్రముఖుల సంతాపం


వైటీ నాయుడు మరణవార్త తెలసుకున్న ఆ పార్టీ ముఖ్య నేతలు వెంటనే నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, నగర ఇన్‌చార్జ్‌ కోటంరెడ్డి  శ్రీనివాసులురెడ్డిలు వైటీ నాయుడు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైటీ నాయుడు సేవలను వారు కొనియాడారు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఎవరు ఆయనతో మాట్లాడినా పార్టీ గురించే అడిగేవారని, వైటీ నాయుడు మరణం తీరని లోటని అన్నారు. కాగా వైటీ నాయుడు మరణంపై టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. అత్యంత ఆత్మీయుడైన వ్యక్తిని కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.  


బాలకృష్ణ పరామర్శ


వైటీ నాయుడు మరణవార్త తెలుసుకున్న సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి కోటంరెడ్డికి ఫోన్‌ చేసి వైటీ నాయుడు కుమారుడు రేవంత్‌, తమ్ముడు బుజ్జయ్యలను పరామర్శించారు. పార్టీకి ఎంతో సేవ చేశారని, ఆయన సేవలను పార్టీ గుర్తుంచుకుంటుందని భరోసా చేశారు. కాగా మరికొంత మంది టీడీపీ నేతలు కూడా వైటీ నాయుడు భౌతిక కాయానికి నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, నన్నే నన్నే సాహెబ్‌, జలదంకి సుధాకర్‌, సాబీర్‌ ఖాన్‌, పమిడి రవికుమార్‌ వైటీకి నివాళుర్పించారు. 

Updated Date - 2021-10-13T05:06:01+05:30 IST