ఏది నిజం..!?

ABN , First Publish Date - 2021-08-11T04:29:43+05:30 IST

సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.

ఏది నిజం..!?
వెంకటాచలం : కంటేపల్లిలోని అటవీ భూమిలో జరిగిన తవ్వకాలు

రా...జుకుంటున్న ‘సర్వేపల్లి’లో మట్టి తవ్వకాల వివాదం

పొలం చదును కోసమే అయితే భారీ గుంతలు తవ్వుతారా!? 

అసలు అనుమతే లేదంటున్న అధికారులు

వాస్తవాలేమిటో నిజనిర్ధారణ కమిటీలు తేలుస్తాయా!?

జిల్లావ్యాప్తంగా మాఫియాలు ఉంటే.. ఒక్క సర్వేపల్లిలోనే రగడ ఎందుకు?


నెల్లూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని ఇరువర్గాల నాయకులు చేసుకునే ఆరోపణలు, తిట్ల దండకం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ వివాదంలో ఏది నిజమో తేల్చడానికి నిజనిర్ధారణ కమిటీల పేరుతో కొంతమంది వివాదాస్పద ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. తమది తప్పులేదని, ఒకవేళ తప్పు జరిగి ఉన్నా అది టీడీపీ వారిదే అని వైసీపీ అంటుండగా, మట్టి దొంగలకు శాలువాలు కప్పి పార్టీలోకి తీసుకుంది మీరు కాదా..! అని ఫొటోలను సాక్షాలుగా పెట్టి టీడీపీ ఎదురుదాడులకు దిగుతోంది. ఇంతకూ ఈ వివాదంలో ఏది నిజం.. అధికార పార్టీ చెబుతున్నదా!? లేదా అధికారులు చెబుతున్నదా!? అనే విషయం ప్రజల్లో ప్రధాన చర్చగా మారుతోంది. మరోవైపు జిల్లావ్యాప్తంగా  మట్టి మాఫియా చెలరేగిపోతున్నా సర్వేపల్లి నియోజకవర్గం ఒక్కటే ఎందుకు టార్గెట్‌ అవుతోందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. 


వెంకటాచలం మండలం కంటేపల్లి వద్ద అటవీ భూముల్లో నుంచి రైల్వే లైను పనులకు పెద్ద ఎత్తున మట్టి తవ్వి తరలిస్తున్నారు. జూన 22వ తేదీన అధికారులు దాడులు జరిపి పెద్ద సంఖ్యలో టిప్పర్లు స్వాధీనం చేసుకుని నామమాత్రపు అపరాధంతో వాటిని వదిలిపెట్టారు. ప్రభుత్వానికి చెందిన ఈ భూముల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని అప్పట్లో అధికారులు స్పష్టం చేశారు. మరోసారి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే, ఇదే ప్రాంతంపై మళ్లీ మట్టి మాఫియా విరుచుకుపడింది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి రాత్రింబవళ్లు మట్టి తవ్వి లోడ్ల కొద్దీ తరలిస్తోంది. 8వ తేదీ రాత్రి టిప్పర్‌ తగిలి విద్యుత తీగ తెగి కంటేపల్లిలోని ఓ ఇల్లు తగలపడటంతో ప్రజల నుంచి తిరుగుబాటు రావడం, విధిలేని పరిస్థితుల్లో అధికారులు రంగంలోకి దిగి ప్రజలను శాంతిపజేయాల్సి వచ్చింది. 


సోషల్‌ మీడియాలో..


ఈ వివాదం ప్రధాన అంశంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య సామాజిక మాధ్యమాల్లో సోమవారం ఒక యుద్ధమే నడిచింది. మట్టి అక్రమ తవ్వకందారు టీడీపీకి చెందిన వారు అని వైసీపీ వర్గాలు పోస్టింగ్‌ పెడితే, ఆ వ్యక్తి 2020, మార్చి 12వ తేదీన వైసీపీలో చేరలేదా!? అని ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో పార్టీలో చేరిన ఫొటోలు పోస్టు చేశారు. కరోనా సందర్భంగా ఎమ్మెల్యే సహాయ నిధి కోసం చెక్కులు ఇస్తున్న ఫొటోలను సైతం పోస్టు చేశారు. వాస్తవాలను పరిశీలిస్తే కంటేపల్లి అటవీ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్న వ్యక్తి గతంలో తెలుగుదేశంలో ఉన్న మాట నిజమే. అదే వ్యక్తి ఇప్పుడు వైసీపీలో ఉన్న మాటా నిజమే. ఈ రెండు ప్రభుత్వాల్లో ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాట నిజమే. అయితే టీడీపీ హయాంలో ఆయన తప్పు చేశారనడానికి ఆధారాలు లేవు కానీ వైసీపీ అండతో ఇప్పుడు తప్పు చేస్తున్నాడని అనేందుకు అధికారుల దాడులే సాక్షం. అటవీ భూముల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని అధికారులు ప్రకటించిన క్రమంలో వైసీపీ నేతల అండతో సదరు వ్యక్తి అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నాడన్నది తేటతెల్లమయ్యింది. 


నిజనిర్ధారణ కమిటీలు..


అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలు జరిగాయా లేదా అని తేల్చేందుకు మంగళవారం వెళ్లిన రాజకీయ పార్టీల నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఏం నిర్ధారించారు? ఎలా అభిప్రాయపడ్డారో తెలియదు కానీ రైతుల అనుమతులతోనే భూములను వ్యవసాయానికి అనువుగా మార్చుకోవడం కోసం మట్టి తవ్వకాలకు అనుమతించారని వైసీపీ నాయకులు ప్రకటన విడుదల చేశారు. అయితే అక్కడ ఒక్కో గుంత పది అడుగులకుపైగా లోతుగా తవ్వేశారు. భూమి చదును కోసం ఇంత లోతు మట్టి తీయ్యరు కదా! అధికార పార్టీ నాయకులు అన్నట్లు ఆ భూమిని దళిత రైతుల సాగు కోసం లీజుకు ఇచ్చిన మాట వాస్తవమే అనుకున్నా, అందులో సాగు చేసుకోవాలి కానీ మట్టిని తవ్వేందుకు అనుమతులిచ్చే అధికారం రైతులకు లేదు. ఈ కోణంలో చూసినా సదరు అక్రమ తవ్వకందారు తన కాంట్రాక్టు పనుల నిమిత్తమే అనుమతులు లేని భూమిలో చట్ట విరుద్ధంగా మట్టి తరలిస్తున్నాడన్న విషయం స్పష్టం అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  అసలు అధికార పార్టీ నాయకులు  ఈ వ్యవహారాన్ని చట్టానికి వదిలేసి ఉంటే అక్రమార్కులను వెనకేసుకొస్తున్నారన్న నింద, ప్రతిపక్షాలు వేలెత్తి చూపే అవకాశం వుండేవి కావు అనే భావన వైసీపీ సానుభూతిపరుల్లో వ్యక్తం అవుతోంది.

   

కనిపించని నిజాలెన్నో..


మట్టి మాఫియా.. సర్వేపల్లి నియోజకవర్గంలోనే జరుగుతోంది అనుకుంటే పొరబాటే. వాస్తవానికి ఇంత కన్నా భారీగా జిల్లావ్యాప్తంగా మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ప్రాజెక్టుల కరకట్టలను సైతం కరిగించేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే ఈ మాఫియాలకు అండగా ఉంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇవేవి వెలుగులోకి రాకపోగా ఒక్క సర్వేపల్లి మాత్రమే తెరపైకి రావడం వెనుక ప్రత్యేక రాజకీయ కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా అధికారులు జిల్లావ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలపై దృష్టి సారించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ప్రజామోదం పొందలేరు. 

Updated Date - 2021-08-11T04:29:43+05:30 IST