వైసీపీకి ఓటు వేయలేదని పింఛన్ కట్
ABN , First Publish Date - 2021-05-06T03:20:25+05:30 IST
మండలంలోని కురిచెర్లపాడు పంచాయతీకి

కురిచెర్లపాడులో ఘటన
సోషల్ మీడియాలో హల్‌చల్
చివరకు పెన్షన్ ఇచ్చిన వలంటీర్
వెంకటాచలం, మే 5 : మండలంలోని కురిచెర్లపాడు పంచాయతీకి చెందిన కాతిరెడ్డి శేషమ్మ అనే ఓ వృద్ధురాలు ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదు. ఈ నెపంతో ఆమె పెన్షన్‌ను గ్రామ వలంటీర్ ద్వారా ఆపేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ ఆడియో వాయిస్ రికార్డు బుధవారం సోషల్ మీడియాలోని హల్‌చల్ చేసింది. ఇదేంటని ఓ టీడీపీ నాయకుడు ఆ వలంటీర్‌ను ఫోన్‌లో ప్రశ్నించాడు. శేషమ్మ పెన్షన్‌కు అర్హురాలని, ఆమెకు పెన్షన్ వస్తుంటే ఎలా ఆపేస్తారని అడిగారు. దీనికి ఆ వలంటీర్ స్పందిస్తూ శేషమ్మకు పెన్షన్ వస్తున్నదని, ఆమెను ఓటు వేయమని కోరితే తన ఇష్టప్రకారంగా వేస్తానని, ఒత్తిడి చేస్తే కేసు పెడతానని శేషమ్మ చెప్పినందుకు నాయకులు పెన్షన్ అపమంటేనే తాము అపేమని సమాధానం ఇచ్చాడు. వైసీపీ నాయకులు చెబితే పెన్షన్ అపడం ఏమిటని, గ్రామ వలంటీర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి అని, ఓటు వేయలేదని నాయకులు చెబితే పెన్షన్ అపడం ఏమిటని ఆ నేత నిలదీశాడు. దీనికి ఆ గ్రామ వలంటీర్ నేను ప్రభుత్వ ఉద్యోగినే కాదని చెప్పలేదు, కానీ నాయకులు చెప్పింది కూడా వినాలి అని వలంటీర్ అన్నప్పుడు నాయకులు చెప్పింది కూడా తీసుకోవాల్సిందేనని తిరిగి సమాధానం ఇచ్చాడు. అయితే సోషల్‌మీడియాలో ఆడియో వాయిస్ రికార్డు వైరల్ కావడంతో బుధవారం సాయంత్రం 5.30 గంటలకు గ్రామంలోని సచివాలయానికి పిలిపించి పెన్షన్‌ను అందజేసినట్లు బాదితురాలు శేషమ్మ తెలిపారు.
వారంరోజులుగా ఇబ్బంది పెట్టారు : శేషమ్మ
తన చేత వేలిముద్రలు వేయించుకొని, పెన్షన్ నగదు ఇవ్వకుండా తనను వారంరోజులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఇది ఏమిటని అడిగితే వైసీపీకి ఓటు వేయినందుకని చెప్పారని పేర్కొంది.
పెన్షన్ ఇచ్చేశాం : వలంటీర్ పేపర్ల ప్రసాద్
శేషమ్మకు వచ్చే పెన్షన్‌ను బుధవారమే ఇచ్చేశామని, కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నాడు.