వైసీపీ నాయకుల అక్రమాలను ప్రశ్నిస్తే కక్ష సాధిస్తారా ?

ABN , First Publish Date - 2021-01-14T04:05:47+05:30 IST

వైసీపీ నాయకుల అక్రమాలను ప్రశ్నిస్తే అధికారులపై ఒత్తిడి తెచ్చి కక్ష సాధింపు చర్యగా దివ్యాంగుడైన దళిత సోదరుడికి జీవనోపాధి లేకుండా పొట్ట కొడతారా అని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.

వైసీపీ నాయకుల అక్రమాలను ప్రశ్నిస్తే కక్ష సాధిస్తారా ?
టీ దుకాణాన్ని పరిశీలిస్తున్న టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

 సర్వేపల్లి నియోజక వర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


వెంకటాచలం, జనవరి 13 : వైసీపీ నాయకుల అక్రమాలను ప్రశ్నిస్తే అధికారులపై ఒత్తిడి తెచ్చి కక్ష సాధింపు చర్యగా దివ్యాంగుడైన దళిత సోదరుడికి జీవనోపాధి లేకుండా పొట్ట కొడతారా అని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని కాకుటూరు గ్రామానికి చెందిన దళిత దివ్యాంగుడు అత్మకూరు ఇమ్మానియేల్‌కు చెందిన టీ దుకాణం ప్రభుత్వ డొంక పొరంకు స్థలంగా చూపుతూ అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం సాయంత్రం ఇమ్మానియేల్‌ను ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కాకుటూరు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపి ప్రభుత్వాన్ని నిలదీయడమే ఇమ్మానియేల్‌ చేసిన తప్పా అని ప్రశ్నించారు.  ఇమ్మానియేల్‌ టీదుకాణం కూల్చేసిన అధికారులకు కావలి నుంచి తడ వరకు రోడ్డు పక్కన మరే దుకాణం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మనుబోలు మండలం అక్కంపేటలో దళితులకు చెందిన సీజేఎస్‌ఎఫ్‌ భూములను రెడ్ల పేరుతో రికార్డులు మార్చేశారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికే అమ్మేసేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామన్నారు. అనికేపల్లికి చెందిన దళిత రైతు గాలి జైపాల్‌ పైనా కూడా కక్ష సాధించారన్నారు. అలాగే టీడీపీకి అండగా ఉన్న బీసీ నేతలైన నాగేంద్రప్రసాద్‌, గంగాధర్‌ యాదవ్‌లకు చెందిన అస్తులు ధ్వంసం చేశారన్నారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులపై వైసీపీ నేతలు పెత్తనం చేస్తూ పేదలు, దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.  కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రాజా యాదవ్‌, సీనియర్‌ నాయకులు నాగేంద్రప్రసాద్‌, కోదండయ్యనాయుడు, ధనుంజయ్యనాయుడు, డబ్బుగుంట సురేంద్ర, కరంశెట్టి వెంకటరత్నం, నలగట్ల సుబ్రహ్మణ్యం, వల్లూరు రమేష్‌నాయుడు, రాజేష్‌, మునుస్వామి, మందల మణియాదవ్‌, షేక్‌ అబ్దుల్లా, ఆకుల రమణయ్య, కమలాకర్‌, బత్తల రఘరామయ్య, గంటబాబు, నిక్కుదల రమేష్‌, దాసి చక్రధర్‌, పాళెపు మణి, ప్రభాకర్‌నాయుడు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-14T04:05:47+05:30 IST