వార్డు నెంబర్ల శిక్షణలో రసాభాస

ABN , First Publish Date - 2021-10-27T02:52:25+05:30 IST

డక్కిలి మండల పరిషత్‌ కార్యాలయంలో రెండురోజులుగా వార్డు నెంబర్లకు, ఉపసర్పంచులకు శిక్షణ తరగతులు జరుగుతున్నా

వార్డు నెంబర్ల శిక్షణలో రసాభాస
మండల పరిషత్‌ కార్యాలయంలో పడేసిన భోజనం

 అటెండర్‌, కార్యదర్శి మధ్య వాగ్వాదం

 మండల పరిషత్‌ సిబ్బంది ప్రేక్షకపాత్ర

డక్కిలి, అక్టోబరు 26: డక్కిలి మండల పరిషత్‌ కార్యాలయంలో రెండురోజులుగా వార్డు నెంబర్లకు, ఉపసర్పంచులకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. మంగళవారం స్పల్పవిషయమై మోపూరు పంచాయతీ కార్యదర్శి ఆర్ముగం, మండల పరిషత్‌ కార్యాలయం అటెండర్‌ మధుసూదన్‌ల మధ్య వాగ్వివాదం  జరిగింది.  దీంతో శిక్షణ కార్యక్రమం రసాభాసగా మారింది. ఆ సమయంలో కార్యదర్శి కొంతమందిని తీసుకువచ్చి భోజనం పెట్టాలని అటెండర్‌కు చెప్పాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వార్డు నెంబర్లుకు కాకుండా ఇతరులకు భోజనం పెట్టకూడదని ఎంపీడీవో తమకు చెప్పాడని అటెండరు తెగేసి చెప్పాడు. దీంతో ఆర్ముగం  మాట్లాడుతూ తాను తీసుకువచ్చినవారు వార్డు నెంబర్లు, ఉపసర్పంచులని, విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సమంజసం కాదని వాదించారు. తర్వాత వారిద్దరూ మం డల పరిషత్‌ కార్యాలయానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొన్నారు. ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండగానే ఒకరిపై ఒకరు దాడిచేసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో మండల పరిషత్‌ సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించారు. ఆ తరువాత మోపూరు వార్డు నెంబరు శంకరరెడ్డి అటెండరుపై ఆగ్రహిస్తూ భోజనం ప్లేటును విసిరేశారు. తదనంతరం మండల పరిషత్‌ సూపరిండెంటెంట్‌ జోక్యం చేసుకొని శిక్షణకు  హాజరైన వారందరికీ భోజనం పెట్టాలని అటెండర్లకు ఆదేశాలు ఇచ్చారు.దీంతో వివాదం సద్దుమణిగింది.


Updated Date - 2021-10-27T02:52:25+05:30 IST