అత్యంత వైభవంగా మస్తాన్‌వలీ గంఽధ మహోత్సవం

ABN , First Publish Date - 2021-11-03T05:24:52+05:30 IST

దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌ వలీ 244వ గంధ మహోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

అత్యంత వైభవంగా మస్తాన్‌వలీ గంఽధ మహోత్సవం
గంధం చదివింపులు ఇస్తున్న కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ

కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ గంధం చదివింపులు  


వెంకటాచలం, నవంబరు 2 : దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌ వలీ 244వ గంధ మహోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి మస్తాన్‌ స్వామి గంధం బంగళాలో ఉంచి ముజావర్ల చేత ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం గంధాన్ని గ్రామంలో ఊరేగించడానికి గుర్రంపై ఉంచారు. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దర్గా ముజావర్లు, అధికారులు ఊరేగింపు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. గంధం ఊరేగింపు ముందు సంప్రదాయక వాయిద్యాలైన మేళతాళాలు, ఫకీర్ల రాతిబ్‌ జార్బ్‌, నవరంగి, తాషా బ్యాండ్‌ వంటి వాయిద్యాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాగడాలను ఊరేగింపులో ఏర్పాటు చేశారు. బాణసంచా కాల్చుతూ అర్ధరాత్రి అనంతరం సుమారు ఒంటిగంట సమయంలో గంధాన్ని గ్రామంలో ఊరేగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గంధం ఊరేగించే గుర్రానికి మొక్కడానికి భక్తులు పోటీ పడ్డారు. గ్రామంలో గంధానికి స్వాగతం పలకడానికి గ్రామస్థులు ఆడుగడుగునా కర్పూర హారతులు పట్టారు. జడ్పీ ఉన్నత పాఠశాల వరకు ఊరేగించిన గంధాన్ని మంగళవారం ఉదయం సుమారు 6 గంటల సమయానికి దర్గా వద్దకు చేర్చారు. అనంతరం మస్తాన్‌వలీ సమాధిపై చద్దర్లను (దుప్పట్లను) కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ గంధం చదివింపులు ఇచ్చారు. అనంతరం దర్గా ముజావర్లు గంధాన్ని భక్తులకు పంచి పెట్టారు. గంధం అందుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. దర్గాలో భక్తులను అనుమతించడంలో నెల్లూరు రూరల్‌ సీఐ డీ జగన్‌మోహన్‌రావు, వెంకటాచలం, పొదలకూరు ఎస్‌ఐలు ఆయ్యప్ప, కరీముల్లా తగు జాగ్రత్తలు పాటించారు. విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు వర్షం కురుస్తున్నప్పటికీ గంధం ఊరేగింపు సజావుగా సాగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  


 నేడు చిన్న గంధం

గంధ మహోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం గ్రామంలో చిన్నగంధం ఉత్సవం జరుగుతుందని వక్ఫ్‌బోర్డు అధికారులు, దర్గా ముజావర్లు వెల్లడించారు. బంగళా నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరే చిన్నగంధం ఊరేగింపు (తహ్‌లీల్‌ ఫాతేహా) మధ్యాహ్నం 12 గంటలలోగా దర్గాకు చేరుతుందన్నారు. అనంతరం గంధం చదివింపు ఇచ్చిన తర్వాత భక్తులకు పంచిపెడతామన్నారు.



Updated Date - 2021-11-03T05:24:52+05:30 IST