ఊరూరా ప్రశాంతంగా కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-05-06T03:30:23+05:30 IST
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు పట్టణంలో బుధవారం కర్ఫ్యూ విధించారు.దీంతో వీధులన్నీ ప్రశాంతంగా కన్పించాయి.మధ్యా

కోవూరు, మే5 : కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు పట్టణంలో బుధవారం కర్ఫ్యూ విధించారు.దీంతో వీధులన్నీ ప్రశాంతంగా కన్పించాయి.మధ్యాహ్నం 12 నుంచి జనసంచారం నిలిచిపోయింది.ఎస్‌ఐ కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి పట్టణంలో పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ 144వ సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు.ప్రజలెవరూ వీధుల్లో తిరగకూడదన్నారు. అనవసరంగా వీధుల్లో తిరిగే వ్యక్తులపై కేసులు నమోదుచేస్తామన్నారు. కర్ఫ్యూ ప్రభావంతో ఎప్పుడూ రద్దీగా ఉండే బజారు కూడలి, సత్రం వీధి, రైల్వేరోడ్డు, తాలూకాఫీసు కూడలి నిర్మానుష్యంగా కన్పించాయి.
కొడవలూరు : లాక్‌డౌన్‌తో మండలంలో ప్రతి గ్రామంలోని వీధులన్నీ బుధవారం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మండలంలో నిత్యం రద్దీగా ఉండే నార్తురాజుపాలెం, కొడవలూరు గ్రామాల్లో జనసంచారం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ సుబ్బారావు మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇందుకూరుపేట : మండలంలో బుధవారం లాక్ డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఆరు నుంచి 12 వరకు ప్రజావసరాలు కోసం సడలింపు ఇచ్చారు. తదనంతరం రవాణా, కార్యాలయాలు అన్నింటిని అడ్డుకున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పికెట్‌లు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు లీలారాణి, నాగరాజు పర్యవేక్షణలో లాక్‌డౌన్ జరిగింది.
పొదలకూరు : కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పక్కాగా పాటించాలని పొదలకూరు సీఐ జి.గంగాధర్‌రావు అన్నారు. బుధవారం మధ్యాహ్నం 12గంటల తర్వాత ఆయన తన సిబ్బంది కలిసి పట్టణంలోని దుకాణాలను మూయించి జన సంచారాన్ని లేకుండా చేశారు. ద్విచక్రవాహనదారులు నిబంధనలు పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా రోడ్డుపై తిరిగే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు.
బుచ్చిరెడ్డిపాళెం : పట్టణంలో బుధవారం కర్ఫ్యూతో వీధులన్నీ ప్రశాంతంగా కన్పించాయి.మధ్యాహ్నం 12 నుంచి జనసంచారం నిలిచిపోయింది.ఎస్‌ఐ ప్రసాదరెడ్డి సిబ్బందితో కలిసి పట్టణంలో పర్యటించారు. ఉదయం 6 వరకూ 144వ సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు.ప్రజలెవ్వరూ గుంపులుగా వీధుల్లో తిరగకూడదన్నారు. కర్ఫ్యూ ప్రభావంతో ఎప్పుడూ రద్దీగా ఉండే జాతీయరహదారి, ప్రధాన వీధులన్నీ బోసిపోయాయి.