ఓటు వేయలేదని యువకుడిపై దాడి

ABN , First Publish Date - 2021-02-27T03:51:18+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని ఓ వ్యక్తిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన మండలంలోని కొత్తపాళెంలో చోటు చేసుకుంది.

ఓటు వేయలేదని యువకుడిపై దాడి
గాయపడిన హరిబాబు

 కొత్తపాళెంలో ఉద్రిక్తత


తోటపల్లిగూడూరు, ఫిబ్రవరి 26: పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని ఓ వ్యక్తిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన మండలంలోని కొత్తపాళెంలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు.. కొత్తపాళేనికి చెందిన తుమ్మతాటి హరిబాబు (30)పై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు బొచ్చు శ్రీనివాసులు, నెల్లూరు చిరంజీవి దాడి చేశారు. గురువారం రాత్రి నిత్యావసర సరుకుల కోసం వెళ్లిన హరిబాబును కొట్టడంతో గాయపడ్డాడు. దీంతో బాధితుడ్ని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తమ పార్టీ మద్దతు అభ్యర్థికి ఓటు వేయలేదన్న కారణంతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారన్న విషయం తెలియడంతో కొత్తపాళెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అవుట్‌పోస్ట్‌ పోలీసుల సమాచారం మేరకు టీపీగూడూరు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-02-27T03:51:18+05:30 IST