గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచండి

ABN , First Publish Date - 2021-05-19T04:56:19+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సూచించారు.

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచండి

జూమ్‌ సమావేశంలో పీఆర్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌


తోటపల్లిగూడూరు, మే 18 : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సూచించారు. మంగళవారం పారిశుధ్యం కార్యక్రమంపై అమరావతి నుంచి జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన   మాట్లాడుతూ కరోనా ఉధృతి  నేపథ్యంలో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,  గ్రామాల్లో బ్లీచింగ్‌, హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయాలని పేర్కొన్నారు. అలాగే తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్‌ తెలిపారు. ఇక కరోనా కష్టకాలంలో కూలి పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద పనులు చేపట్టాలని, అర్హులైన వారందరికీ జాబ్‌ కార్డులు పంపిణీ చేయాలని సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంపీడీవో హేమలత మాట్లాడుతూ పారిశుధ్య ప్రక్రియ ప్రజల ఆరోగ్యాలను కాపాడడమే కాకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి దోహదపడుతుందన్నారు.   పారిశుధ్య కార్యక్రమాలపై ప్రతి ఒక్కరు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో సూచించారు. జూమ్‌ సమావేశంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. 


‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’పై అవగాహన

బుచ్చిరెడ్డిపాళెం, మే 18: బుచ్చిరెడ్డిపాళెంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’పై సర్పంచులు, కార్యదర్శులకు డీఎల్‌పీవో రమేష్‌బాబు, ఎంపీడీవో నరసింహారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గ్రామాల్లో అమలుచేయడంపై ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో పలువురు సర్పంచులు ఆయా గ్రామాల్లో ఉపాఽధిహామీ పనులు, పంచాయతీ పరిధిలోని రోడ్లు తదితర సమస్యలపై డీఎల్పీవోకు వివరించారు. దీనిపై స్పందించిన డీఎల్పీవో సర్పంచుల ఆధ్వర్యంలో జరిగిన పనులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ పెంచల శ్యాం, పలువురు సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T04:56:19+05:30 IST