వేటు పడింది!

ABN , First Publish Date - 2021-10-22T04:47:49+05:30 IST

ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన వెంకటగిరి తహసీల్దారు ఆదిశేషయ్యపై వేటుపడింది.

వేటు పడింది!
వెంకటగిరి తహసీల్దారు ఆదిశేషయ్య (ఫైల్‌)

సీసీఎల్‌ఏకు వెంకటగిరి తహసీల్దారు సరెండర్‌

ఆదినుంచి ఆరోపణల వెల్లువ

ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం

వరుస ఫిర్యాదులతో విచారణ

నివేదికల ఆధారంగా కలెక్టర్‌ చర్యలు


వెంకటగిరి, అక్టోబరు 21 : ప్రభుత్వ భూములను  అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన వెంకటగిరి తహసీల్దారు ఆదిశేషయ్యపై వేటుపడింది. ఆయన్ను భూ సంస్కరణల విభాగానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ చక్రధర్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిశేషయ్యపై వేటు పడటంతో రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బాలాయపల్లి తహసీల్దారుగా పనిచేస్తున్న ఆదిశేషయ్య ఆ సమయంలోనే వెంకటగిరి తహసీల్దారుగా ఇనచార్జి బాధ్యతలు చేపట్టారు. అప్పట్లోనే కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను కట్టబెట్టడంతో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తహసీల్దారు ఆదిశేషయ్య చేసిన భూ అవకతవకలపై ఆధారాలు ఉన్నాయని, విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిని ఏమాత్రం పట్టించుకోని అధికారులు ఆయన్ను గతేడాది వెంకటగిరి తహసీల్దారుగా బదిలీ చేశారు.  విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే పట్టణంలోని చెవిరెడ్డిపల్లి సర్వే నెం.96లో 16, 17, 18, 19, 20, 21 నెంబర్లలో సుమారు 5 ఎకాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిట కట్టబెట్టడం పెద్ద దుమారం రేపింది. ఈ భూముల విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా.  ఈ వ్యవహారంపై వెంకటగిరికి చెందిన శ్రీకృష్ణదేవరాయ కాపు, బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోట కృష్ణయ్య  తన దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక వర్దనపల్లిలో 6 ఎకరాలు, మొగళ్లు గుంటలో చెరువు పోరంబోకు, మేతపోరంబోకు, అటవీ భూములకు పట్టాలు ఇచ్చారని కృష్ణయ్య తన ఫిర్యాదులో పేర్కొంటూ రూ.లక్షలు చేతులు మారాయని ఆరోపించారు. ఇంకా పలు గ్రామాల్లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూములు బడా భూస్వాములకు కట్టపెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దారుపై తొలుత ఈ ఏడాది ఆగస్టులో గూడూరు సబ్‌కలెక్టరు మురళీకృష్ణ విచారణ చేపట్టారు. అయితే, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కృష్ణయ్య జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబరు 24వ తేదీన విజిలెన్సు అధికారి ద్వారా విచారణ చేపట్టారు. అయినా చర్యలు శూన్యం కావడంతో కృష్ణయ్య మళ్లీ ఈ నెల మొదటి వారంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టరు చక్రధర్‌బాబు ఈ నెల 10వ తేదీన  తహసీల్దారుపై విచారణకు తెలుగుగంగ ప్రత్యేక కలెక్టరును పంపించారు. ఆయన వెంకటగిరి చేరుకుని పూర్తిస్థాయిలో విచారించి, నివేదికను కలెక్టరుకు అందజేశారు. దీంతో ఆదిశేషయ్యను సీసీఎల్‌ఏకు సరెండర్‌ చేస్తూ గురువారం ఆదేశాలు జారీచేశారు. కాగా  తహసీల్దారు ఆదిశేషయ్యకు ఈ నెల 20వ తేదీన గుండెపోటు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. 


Updated Date - 2021-10-22T04:47:49+05:30 IST