వీళ్లేం ‘పాప’ం చేశారు!?

ABN , First Publish Date - 2021-06-22T04:16:09+05:30 IST

నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో..

వీళ్లేం ‘పాప’ం చేశారు!?
ప్రాణాలు వదిలిన చిన్నారులు

ఏడాది కూడా నిండని కవలలను చిదిమేశారు!

పాలు తాగి ప్రాణాలొదిలిన పసికందులు

అత్తవారింటిపైనే తల్లి అనుమానం

పోలీసులకు ఫిర్యాదు... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 


మనుబోలు(నెల్లూరు): తల్లి గర్భంలో నుంచి భూమి మీదకొచ్చి ఏడాది కూడా దాటలేదు. నాన్న చేయిపట్టి బుడిబుడి అడుగులు వేయనేలేదు. మోకాళ్లతో ఇల్లంతా దోగాడుతూ అల్లరి  చేసే వయసు. అమ్మా... అత్తా అని నోరు తెరచి పలకలేని పాలబుగ్గలు. పుట్టిన పది నెలల తర్వాత నాన్నమ్మ ఒడికి చేరిన ఆ పసికందులకు అప్పుడే నూరెళ్లు నిండాయి. ఏం జరిగిందో.. ఏమో నోట్లో నురగలు కక్కుతూ తిరిగిరాని లోకానికి చేరారు. దాంపత్య జీవితంలో ఎన్ని వివాదాలు రేగినా తన కవలలే సర్వస్వమని మురిసిపోయిన ఆ మాతృమూర్తి గుండె పగిలేలా రోదించింది. ‘‘అయ్యో.. బంగారం లాంటి బిడ్డలే.. ఎవరు పొట్టన పెట్టుకున్నారో’’నంటూ బంధువులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.  మనుబోలు మండలం  రాజవోలుపాడులో ఆదివారం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.


నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న బాలాయపల్లి మండలం వెంగమాంబపురానికి చెందిన నగిరపాటి నాగరత్నమ్మకు, అదే ఆసుపత్రి పక్కనే హోటల్‌లో పని చేస్తున్న మనుబోలు మండలం రాజవోలుపాడు దళితవాడకు చెందిన పుట్టా వెంకట రమణయ్యకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలకు చెప్పకుండా ఇద్దరూ కసుమూరులో 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2 నెలల వరకు నెల్లూరులోనే ఉన్న ఆ జంట నాగరత్నమ్మ గర్భం దాల్చడంతో పెద్దలను ఒప్పించి రాజవోలుపాడుకు వెళ్లారు. నాగరత్నమ్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వెంకటరమణయ్య తల్లిదండ్రులు నిత్యం వేధించేవారు. ఈ క్రమంలో భర్త నాగరత్నమ్మను కొట్టి పుట్టింటికి పంపేశాడు. గతేడాది ఆగస్టులో నాగరత్నమ్మకు ఇద్దరు ఆడ కవల పిల్లలు పుట్టారు. ఈ విషయం తన భర్తకు తెలియజేసినా ఇష్టం లేని వెంకటరమణయ్య ఆసుపత్రికి రాలేదు. దీంతో నాగరత్నమ్మ బాలాయపల్లి పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసింది. పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పది రోజుల క్రితం భార్యాబిడ్డలతో వెంకటరమణయ్య దళితవాడలో ఓ ఇంట్లో వేరు కాపురం పెట్టాడు. అయినా భార్యాభర్తల మధ్య మన్పర్థలు రేగుతూనే ఉన్నాయి.


పాలల్లో ఏం కలిపారు!?

ఈ క్రమంలో ఆదివారం వెంకటరమణయ్య తల్లి ఇంటికి రావడంతో తన కుమార్తెలను ఆమెకు చూపించేందుకు కొత్తదుస్తులు వేసి సిద్ధం చేసి పాలు  తాపించి తీసుకెళ్లింది. కొద్దిసేపటికే చిన్నారుల నోట్లో నుంచి నురుగు రావడంతో నాగరత్నమ్మ భయపడి పిల్లలను తీసుకుని తన అత్తారింటికి వెళ్లి నిలదీసింది. ఏం జరిగిందిక్కడ.. పిల్లలకు ఎందుకిలా నురుగు వస్తోందని ప్రశ్నించగా ఇద్దరు పసికందులను తీసుకుని వీరంపల్లిలో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆయన నెల్లూరుకు తీసుకెళ్లాలని సూచించడం, వెనువెంటనే నెల్లూరుకు రాగానే ఆ ఇద్దరు పసికందులు  చనిపోయారని వైద్యులు తేల్చి చెప్పారు. చనిపోయిన  చిన్నారుల పాదాలు రంగుమారడం, తాగిన పాలు నీలంరంగులో మారడంతో నాగరత్నమ్మకు మరింత అనుమానం పెరిగింది. తన అత్త ఇంట్లో ఏదో జరగడం వల్లే బిడ్డలు చనిపోయారంటూ రోదించసాగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గూడూరు రూరల్‌ సీఐ ఎం.శ్రీనివాసరెడ్డి, మనుబోలు, చిల్లకూరు ఎస్‌ఐలు ముత్యాలరావు, సుధాకర్‌రెడ్డిలు తమ సిబ్బందితో రాజవోలుపాడుకు చేరుకున్నారు. పిల్లల వివరాలు, చనిపోవడానికి కారణలపై బంధువులు, గ్రామస్థుల నుంచి ఆరా తీశారు. శవపరీక్షల కోసం చిన్నారుల మృతదేహాలను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాలడబ్బాను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  ఏడాది కూడా నిండని చిన్నారులు చనిపోవడం బాధాకరమని, అన్ని పరీక్షల ఫలితాలు వచ్చాక చిన్నారుల మృతికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-06-22T04:16:09+05:30 IST