వావిళ్ల కేంద్రంగా బెంగుళూరు మద్యం

ABN , First Publish Date - 2021-02-06T04:40:05+05:30 IST

మండలంలోని వావిళ్ల గ్రామం కేంద్రంగా బెంగుళూరు రాష్ట్రానికి చెందిన మద్యం దందా జోరుగా సాగుతోందని స్థానికులు తెలుపుతున్నారు.

వావిళ్ల కేంద్రంగా బెంగుళూరు మద్యం

పట్టించుకోని అధికారులు


విడవలూరు, పిబ్రవరి 5: మండలంలోని వావిళ్ల గ్రామం కేంద్రంగా బెంగుళూరు రాష్ట్రానికి చెందిన మద్యం దందా జోరుగా సాగుతోందని స్థానికులు తెలుపుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. వావిళ్ల నుంచి భారీగా మద్యం తరలిపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం మిన్నకుండిపోతున్నారన్న  ఆరోపణలున్నాయి.  


చికెన్‌ వ్యర్థాల తరలింపు వాహనంలో దిగుమతి

మండలంలోని వావిళ్ల, రామతీర్థం, దంపూరు, చౌకిచర్ల, గాదెలదిన్నె గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు చికెన్‌ వ్యర్థాల వ్యాపారం చేస్తున్నారు. బెంగుళూరు, చెనై నుంచి ఈ వ్యర్థాలను తీసుకొచ్చి పలు ప్రాంతాల్లో సాగు చేస్తున్న పంగస్‌ చేపలు పెంచే గుంతలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మద్యం ధరలకన్నా, బెంగుళూరులో మద్యం ధర లు తక్కువ ఉండటంతో కొందరు అక్రమార్కులు  అక్రమ మద్యం వ్యాపారానికి తెరతీశారు. ఎవరికి అనుమానం కలుగకుండా చికెన్‌ వ్యర్థాలను తరలించే వాహనాల్లో బెంగుళూరు మద్యాన్ని పెద్ద సంఖ్యలో వావిళ్లకు    తీసుకొచ్చి విక్రయిస్తునట్లు సమాచారం. రోజూ లక్షల్లో మద్యం వ్యాపారం జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ విక్రయించే మద్యం కన్నా.. బెంగుళూరు నుంచి తీసుకుని వచ్చి అమ్ముతున్న మద్యం ధర తక్కువ కావటంతో మద్యపాన ప్రియులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. వావిళ్ల గ్రామానికి తీసుకువస్తున్న మద్యాన్ని బియ్యం బస్తాల్లో కోవూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు గ్రామాలకు తరలిస్తున్నారు. బెంగుళూరు మద్యానికి   డిమాండ్‌ పెరగటంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు - ఆరు కాయలుగా సాగుతోంది. 


పట్టించుకోని అధికారులు

వావిళ్ల కేంద్రంగా మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నా ఎక్సైజ్‌, పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విడవలూరు ఎస్‌ఐ మహేంద్ర బెంగుళూరు మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయినా అక్రమ మద్యం వ్యాపారం మాత్రం ఆగలేదు. ఇందులో జిల్లా ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అందుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.  


మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం : మహేంద్ర, ఎస్‌ఐ  

 వావిళ్ల గ్రామంలో బెంగుళూరు నుంచి మద్యం తీసుకుని వచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం లేదు. అయినా మద్యం అక్రమాలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు   నిర్వహిస్తున్నాం. అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2021-02-06T04:40:05+05:30 IST