సలసల కాగుతున్న వంట నూనెలు

ABN , First Publish Date - 2021-01-11T04:50:04+05:30 IST

సంక్రాంతికి పేదలు సంతృప్తిగా వంటలు చేసుకునే వీలులేకుండా వంట నూనె ధరలు ఆకాశాన్నంటాయి.

సలసల కాగుతున్న  వంట నూనెలు

భారీగా పెరిగిన సన్‌ఫ్లవర్‌, పామాయిల్‌ ధరలు


నెల్లూరు(జడ్పీ), జనవరి 10 : సంక్రాంతికి పేదలు సంతృప్తిగా వంటలు చేసుకునే వీలులేకుండా వంట నూనె ధరలు ఆకాశాన్నంటాయి. బాండలిలో నూనె పోసి మంట వెలగించిన తరువాత నూనెలు సలసలకాగాల్సి ఉండగా.  పొయ్యి ఎక్కకముందే ధరలతోనే సలసల కాగుతున్నాయి. సంక్రాంతికి పేదలు  పిండివంటలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. కరోనా ఎఫెక్ట్‌, వంట నూనెలు ఉత్పత్తి చేసే దేశాలు విధించిన అధిక పన్నుల ప్రభావంతో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. మూడు నెలల్లోపే సన్‌ఫ్లవర్‌పై కిలోకు రూ.40లు, పామాయిల్‌పై రూ.30లు పెరిగాయి. అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ధరలను కేంద్రం నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వంట నూనెలు పేదలకు పెనుభారంగా మారాయి. 


భారీగా పెరిగిన ధరలు


సన్‌ఫ్లవర్‌, పామాయిల్‌ ఉత్పత్తి మలేషియా, ఇండోనేషి యా దేశాల్లో అధికంగా ఉంటుంది. ఆ దేశాల నుంచి మనదేశానికి ఈ ఆయిల్స్‌ దిగుమతి  అవుతాయి. కరోనా సమయంలో భారీగా ఉత్పత్తి తగ్గడంతో సరుకుకు డిమాండ్‌ పెరిగి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబరులో 10కిలోలు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌  ధర రూ.1000 ఉండగా, ప్రతి నెలా పెరుగుతూ రూ.1145, 1245, 1330 నుంచి 1400లకు పెరిగింది. దీనికితోడు 5శాతం టాక్స్‌, రవాణా చార్జీలు అదనంగా ఉండడంతో కిలో సన్‌ఫ్లవర్‌ రూ.160మేర రిటైల్‌గా అమ్ముతున్నారు. అలాగే పామాయిల్‌ గత ఏడాది సెప్టెంబరులో 10కి.లోల ధర రూ.840 ఉండగా విడతలుగా రూ.920, 9,40, 1050, 1100లకు పెరిగింది. దీనికి ట్యాక్స్‌, రవాణా చార్జీలు కలిపి పామాయిల్‌ రూ.125మేర అమ్ముతున్నారు. 


ప్రజలపై పెనుభారం


ఆయిల్‌ ధరలు ప్రభావం ప్రజలపై అధికంగా పడింది. వంట నూనెలు నిత్యావసర సరుకు కావడంతో ప్రతి ఒక్కరూ వంట నూనెలను ఉపయోగించుకోవాల్సి ఉంది. దీంతో జిల్లాలో రోజుకు దాదాపుగా లక్ష లీటర్ల పామాయిల్‌, 30వేల లీటర్ల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. పామాయిల్‌ మీద  మూడు నెలల్లో రూ.26కోట్లు మేర భారం ప్రజలపై పడుతోంది. అలాగే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై రోజుకు రూ.12కోట్ల మేర అదనపు భారం జిల్లా ప్రజలపై పడుతుంది.  ధరల నియంత్రణకు కేంద్రప్రభుత్వం 10శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించినప్పటికీ గతంలో ఎన్నడూ లేనివిధంగా సరుకు డిమాండ్‌ను సాకు చూపి మలేషియా,  ఇండోనేషియా  దేశాల్లో ఎగుమతి సుంకాన్ని 30శాతం విధించడంతో ధరల తగ్గుదల ఉండడం లేదని హోల్‌సేల్‌ వ్యాపారులు తెలుపుతున్నారు. 

Updated Date - 2021-01-11T04:50:04+05:30 IST