వ్యాక్సిన్ వచ్చేసింది!
ABN , First Publish Date - 2021-01-13T04:49:36+05:30 IST
ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేసింది. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వ్యాక్సిన్ మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయానికల్లా జిల్లాకు చేరుకోనుంది.

33వేల డోసులకుపైగా జిల్లాకు కేటాయింపు
నిల్వకే ప్రత్యేక ఏర్పాట్లు
26 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
తొలివిడతలో 30వేల మందికి..
16వ తేదీన లాంఛనంగా ప్రారంభం
నెల్లూరు (వైద్యం), జనవరి 12 : ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేసింది. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వ్యాక్సిన్ మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయానికల్లా జిల్లాకు చేరుకోనుంది. ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు రాష్ట్రంలో నాలుగు కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతోంది. మొదటి విడత కింద జిల్లాకు 33 వేల డోసులకుపైగా వ్యాక్సిన్ రానుంది. వైద్యశాఖతోపాటు పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, పోలీసు శాఖ సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ధారించగా, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, సిబ్బందితోపాటు ఐసీడీఎస్ విభాగాలకు చెందిన వారికే వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక రూపొందించారు. దీంతో ఆయా విభాగాలకు చెందిన 30 వేలకు మందికిపైగా వ్యాక్సిన్ వేయనున్నారు.
జిల్లాలో 26 కేంద్రాలు
వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు జిల్లాలో 26 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరులోని జీజీహెచ్ పరిధిలోని పీపీయూనిట్, జనార్ధనరెడ్డి కాలనీలోని పట్టణ ఆరోగ్యకేంద్రం, కోటమిట్ట, యూకో నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అలాగే కావలిలోని ఏరియా ఆసుపత్రి, కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విడవలూరు పీహెచ్‌సీ, అల్లూరు, కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), సూళ్లూరుపేట సీహెచ్‌సీ, నాయుడుపేట సీహెచ్‌సీ, డీవీ సత్రం పీహెచ్‌సీ, వెంకటగిరి సీహెచ్‌సీ, రాపూరు సీహెచ్‌సీ, డక్కిలి పీహెచ్‌సీ, కోట సీహెచ్‌సీ, గునపాటి పాళెం పీహెచ్‌సీ, చిట్టేడు పీహెచ్‌సీ, వెంకటాచలం సీహెచ్‌సీ, ఉదయగిరి సీహెచ్‌సీ, నర్రవాడ పీహెచ్‌సీ, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి, సంగం పీహెచ్‌సీ, సౌత్‌మోపూరు పీహెచ్‌సీ, పొదలకూరు సీహెచ్‌సీ, కలువాయి పీహెచ్‌సీ కేంద్రాలను అధికారులు ఏంపిక చేశారు.
వ్యాక్సిన్ నిల్వలకు ఏర్పాట్లు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చేరుకునే వ్యాక్సిన్ నిల్వకు ఫ్రీజర్లను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ కేంద్రంలోనే 11 లక్షల కరోనా డోసులను నిల్వచేసుకునే సామర్థ్యం ఉంది. ఇటీవల 48,8251 డోసుల సామర్థ్యం కలిగిన మూడు భారీ ఫ్రీజర్లను డీఎంహెచ్‌కు కార్యాలయానికి వచ్చాయి. ప్రస్తుతం మొదటి విడతలో కేవలం 33 వేల డోసులు మాత్రమే వస్తున్నందున వీటి నిల్వకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే, జిల్లావ్యాప్తంగా వ్యాక్సిన్ తరలించేందుకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో మూడు వాహనాలకు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక వాహనాలలో వ్యాక్సిన్
ఇప్పటికే విజయవాడ గన్నవారం విమానాశ్రయానికి కరోనా వ్యాక్సిన్ వచ్చింది. జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాలకు పోలీసుల సంరక్షణలో బుధవారం నుంచి వ్యాక్సిన్‌ను మూడు వాహనాలలో తరలిస్తాం. ఈ నెల 16వ తేదీన వ్యాక్సిన్ వేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.
- డాక్టర్ రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో
వ్యాక్సిన్ సక్రమంగా జరిగేలా చూడండి: డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి
జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాలలో వ్యాక్సిన్ పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి వెల్లడించారు. మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో వ్యాక్సిన్ కేంద్రాలకు నియమించిన అధికారులకు శిక్షణ కార్యక్రమంల జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డిజిటల్ అసిస్టెంట్స్ డేటా అప్‌లోడ్‌కు సంబంధించి ఎంపిక చేసిన వారి జాబితా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా ప్రధానితోపాటు ముఖ్యమంత్రి కూడా కరోనా కేంద్రాల అధికారులతో మాట్లాడే అవకాశం ఉన్నందున ఆయా కేంద్రాలలో వీడియా సౌకర్యాన్ని అమర్చుకోవాలని సూచించారు. కరోనా నిబంధనల ప్రకారం శానిటైజర్లు, మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ శిక్షణలో అదనపు జిల్లా వైద్యాధికారిణి స్వర్ణలత, డీసీహెచ్‌ఎ్‌స ప్రభావతి, డీఐవో శెలీనా కుమారి, డీటీసీవో వెంకటప్రసాద్, వైద్యులు ఉమామహేశ్వరి, అమరేంద్రనాథ్ రెడ్డి, డెమా శ్రీనివాసులు, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.