ఉగ్రవాదాన్ని తలపిస్తున్న వైసీపీ అరాచకాలు

ABN , First Publish Date - 2021-10-21T03:25:43+05:30 IST

రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ దాడులు ఉగ్రవాద చర్యలను తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు.

ఉగ్రవాదాన్ని తలపిస్తున్న వైసీపీ అరాచకాలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, టీడీపీ నాయకులు

గూడూరు, అక్టోబరు 20: రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ దాడులు ఉగ్రవాద చర్యలను తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు. టీడీపీ పిలుపు మేరకు బంద్‌ నిర్వహించేందుకు ఇంటి నుంచి బయలుదేరుతున్న ఆయనతోపాటు, టీడీపీ నాయకులను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, తమ పార్టీ నాయకుడు పట్టాభి నివాసంపై జరిగిన దాడులను నిరసిస్తూ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. అయితే పోలీసులు తమను హౌస్‌అరెస్ట్‌ చేయడం  మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర డీజీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నాడన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పైశాచిక ఆనందం కోసం టీడీపీ కార్యాలయాలు, నాయకులపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. యువత జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్న డ్రగ్స్‌ గుట్టు విప్పడమే ప్రతిపక్షం చేసిన తప్పా అని ప్రశ్నించారు. తమ పార్టీ పిలుపు మేరకు పట్టణంలో స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించిన పాఠశాలల యాజమాన్యానికి, వ్యాపారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కాగా, ఈ సందర్భంగా అరెస్టు చేసిన 30 మంది టీడీపీ నాయకులను మధ్యాహ్నం 1గంట అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, వాటంబేడు శివకుమార్‌, ఇశ్రాయిల్‌కుమార్‌, బత్తిన ప్రణీత్‌, మువ్వా చరణ్‌, వెంకటేష్‌, పెంచలయ్య, నరసింహులు, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు    మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర్లురెడ్డి, నాయకులు నెల్లటూరు చిరంజీవి, యదనపర్తి భాస్కర్‌రెడ్డి, చిల్లకూరు పట్టాభిరామిరెడ్డిలతో పలువురు టీడీపీ నాయకులను పోలీసులు హౌస్‌అరెస్ట్‌  చేశారు. 

వెంకటగిరిటౌన్‌,:  పట్టణంలో టీడీపీ బంద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 6 గంటలకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావును పోలీసులు హౌస్‌అరెస్ట్‌ చేశారు. ఇందుకు నిరసనగా కార్యకర్తలు క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. తెలుగుయువత జిల్లా నాయకుడు కేవీకే ప్రసాద్‌, సీసీ నాయుడు, సుబ్బుయాదవ్‌, గంగాధర్‌, శ్రీనివాసులునాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T03:25:43+05:30 IST