గుప్త నిధుల కోసం దుర్గంపై తవ్వకాలు

ABN , First Publish Date - 2021-03-23T03:32:56+05:30 IST

ఉదయగిరి దుర్గంపై గుప్తనిధుల తవ్వకాల ముఠా మకాం వేసింది. కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ జనరేటర్‌ సహాయంతో రేయింబవళ్లు తవ్వకాలు చేస్తున్నారు.

గుప్త నిధుల కోసం దుర్గంపై తవ్వకాలు
ఉదయగిరి దుర్గం


కొండపై 10 నుంచి 12 మంది సభ్యుల ముఠా మకాం

జనరేటర్‌ సహాయంతో రేయింబవళ్లు పనులు

పర్యాటకుల కంటపడ్డ తవ్వకాల ముఠా

భయబ్రాంతులకు గురైన పర్యాటకులు

ఉదయగిరి రూరల్‌, మార్చి 22: ఉదయగిరి దుర్గంపై గుప్తనిధుల తవ్వకాల ముఠా మకాం వేసింది. కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ జనరేటర్‌ సహాయంతో రేయింబవళ్లు  తవ్వకాలు చేస్తున్నారు. ఆదివారం దుర్గం ఆందాలను చూసేందుకు వెళ్లిన పలువురి పర్యాటకులకు తవ్వకాలు చేస్తున్న ముఠా కంటపడింది. పర్యాటకులు తవ్వకాలు చేస్తున్న వారిని పలకరించినా వారు ఏమీ మాట్లాడకపోవడం, మౌనంగా ఉండడంతో తమపై ఎక్కడ దాడి చేస్తారోనన్న ఆందోళనలో పర్యాటకులు మిన్నకుండిపోయారు. ఉదయగిరి దుర్గాన్ని విజయనగరరాజులు, నవాబులు పరిపాలించిన కాలంలో నగదు, బంగారం, వజ్రవైడుర్యాలు, ఆలయాలు, భవనాలతోపాటు భూమిలో దాచి పెట్టి ఉంటారనేది పలువురి నమ్మకం. అందులో భాగంగానే ముఠా ఉదయగిరి దుర్గాన్ని గుప్తనిధుల తవ్వకాల కేంద్రంగా ఎంచుకున్నారు. ఇటీవల స్తబ్దుగా ఉన్న ఈ ముఠా తిరిగి తవ్వకాలు ప్రారంభించింది. ఆదివారం దుర్గం అందాలను తిలకించేందుకు పలువురు పర్యాటకులు వెళ్లారు. వారు చిన్న మసీదు దాటి పెద్ద మసీదుకు వెళుతుండగా మధ్యలో ఐదుగురు సభ్యులు లుంగీలు ధరించి సొరంగ మార్గాన్ని తవ్వుతూ కంటపడ్డారు. అక్కడే జనరేటర్‌, వాటర్‌క్యాన్‌లు, ఇతరత్రా తవ్వకాలు వస్తువులు ఉండడాన్ని గుర్తించారు. పర్యాటకులు వారిని పలకించేందుకు ప్రయత్నించగా వారి నోట వెంట ఎలాంటి సమాధానం రాలేదు. ఎక్కువ ప్రశ్నిస్తే తమపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడి వారి దారిన వారు వెళ్లారు. మరి కొంతదూరంలో ఉన్న గుర్రపుశాల వద్దకు వెళ్లగా అక్కడ ముగ్గురు వ్యక్తులు భోజనాలు తయారు చేస్తుండడాన్ని, పెద్ద మసీదు వద్ద మరో ముగ్గురు వ్యక్తులు సంచరించడాన్ని గుర్తించారు. వీరంతా గుప్తనిధుల తవ్వకాల ముఠా అని నిర్థారించుకుని పర్యాటకులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కిందకు పరుగులు తీశారు. ముఠాకు అన్ని వసతులు సమకూరుతున్నాయంటే స్థానికుల హస్తం ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుప్తనిధుల తవ్వకాల ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి ధ్వంసమవుతున్న దుర్గం ఆందాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.



Updated Date - 2021-03-23T03:32:56+05:30 IST