ఘనంగా వైఎస్ జయంతి
ABN , First Publish Date - 2021-07-09T04:01:16+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని గురువారం నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుజాతి ఎన్నటికీ మరువలేని మహానేత వైఎస్ అంటూ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నివాళి అర్పించారు.

నెల్లూరు(జడ్పీ); జూలై 8 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని గురువారం నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుజాతి ఎన్నటికీ మరువలేని మహానేత వైఎస్ అంటూ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నివాళి అర్పించారు. ఆయన కార్యాలయంలో, సతీమణి ప్రశాంతిరెడ్డితో కలిసి వైఎస్ జయంతి వేడుక నిర్వహించారు. రైతాంగం, పేదలు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చూపిన మార్గం అందరికీ ఆదర్శమైందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి కరెంటు ఆఫీస్ సెంటర్‌లో ఉన్న వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసిన నేత రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి గిరిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మరణం లేని మహానేతగా వైఎస్‌ఆర్ అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రైతులకు అండగా నిలిచి జలయజ్ఞం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు.
