గెలుపు పక్కా.. మెజార్టీయే ఎంతో...?

ABN , First Publish Date - 2021-09-19T05:45:02+05:30 IST

నా గెలుపు పక్కా.....! కానీ మోజార్టీ ఎంతన్నదే అర్థం కావడంలేదు!. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై నెల్లూరు రూరల్లోని అధికార పార్టీ అభ్యర్థుల్లో నెలకొన్న ధీమా ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొన్ని నెలల క్రితం ఎంపీటీసీ స్థానాలకు జరిగిన పోటీలో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రచారాలు, ఇతర ఆర్భాటాలకు దూరంగా ఉండిపోయారు.

గెలుపు పక్కా..  మెజార్టీయే ఎంతో...?

‘పరిషత్‌’ ఫలితాలపై అధికారపార్టీ అభ్యర్థుల ధీమా 

12 స్థానాల్లో 4 ఇప్పటికే ఏకగ్రీవం 

8 ఎంపీటీసీలకు నేడు ఓట్ల లెక్కింపు


నెల్లూరురూరల్‌, సెప్టెంబరు 18 : నా గెలుపు పక్కా.....! కానీ మోజార్టీ ఎంతన్నదే  అర్థం కావడంలేదు!. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై నెల్లూరు రూరల్లోని అధికార పార్టీ అభ్యర్థుల్లో నెలకొన్న ధీమా ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొన్ని నెలల క్రితం ఎంపీటీసీ స్థానాలకు జరిగిన పోటీలో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రచారాలు, ఇతర ఆర్భాటాలకు దూరంగా ఉండిపోయారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మిన్నకుండిపోవడంతో అధికార వైసీపీ అన్నింటా హవా చూపింది. దీంతో ఓట్లు ఏకపక్షంగా పడ్డాయన్నది అందరి అంచనా. కాగా, ఆ ఎన్నికల్లో మండలంలోని ప్రతి గ్రామంలోనూ ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. టీడీపీ తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అక్కడక్కడ ప్రయత్నించింది.  కందమూరులో మాత్రమే అధికార వైసీపీకి గట్టిపోటీగా నిలిచింది. మిగిలిన 7 స్థానాల్లో ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. కాగా, నెల్లూరు రూరల్‌ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా అందులో దేవరపాళెం, ములుముడి, ఆమంచర్ల-2, దొంతాలి స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. సౌత్‌మోపూరు, గొల్లకందుకూరు, కందమూరు, వెల్లంటి, పెనుబర్తి, కాకుపల్లి, పొట్టేపాళెం, ఆమంచర్ల -1 స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లెక్కింపు నిలిచిపోయింది. తాజాగా రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. 

Updated Date - 2021-09-19T05:45:02+05:30 IST