జగన్‌ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి

ABN , First Publish Date - 2021-08-22T03:57:10+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ శనివారం స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకున్నారు.

జగన్‌ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి
దర్గాలో ప్రార్థన చేస్తున్న అజీజ్‌

టీడీపీ నేత అబ్దుల్‌ అజీజ్‌

నెల్లూరు (సాంస్కృతికం), ఆగస్టు 21: ముఖ్యమంత్రి జగన్‌ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ శనివారం స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకున్నారు. అనంతరం బారాషహీద్‌ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వండని జగన్‌ అభ్యర్ధిస్తే.. రాష్ట్ర ప్రజలు తెలిసో తెలియకో ఓటు వేసి మోసపోయారన్నారు.  రొట్టెల పండుగ రద్దుతో నష్టపోయిన చిరు వ్యాపారులకు ప్రభుత్వం రూ.5వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి జగన్‌ నుంచి విముక్తి, దేశానికి పట్టిన మహమ్మారి కరోనా పీడ వీడి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ రొట్టె పట్టుకున్నానని తెలిపారు. రాష్ట్ర పండుగైన రొట్టెల పండుగను రద్దు చేసినట్లు ప్రజలకు తెలియజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం విఫలమైందన్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వెనుతిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దర్గా పరిసరాలను పరిశీలించి మైదానంలో మద్యం సీసాలు ఉండడంపై ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, రాష్ట్ర మహిళా నిర్వాహక కార్యదర్శి మల్లి నిర్మల, అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్‌యాదవ్‌, సాబీర్‌, జలదంకి సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T03:57:10+05:30 IST