అట్టుడికిన నగరం

ABN , First Publish Date - 2021-10-21T04:29:42+05:30 IST

టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడంతో బుధవారం ఆ పార్టీ శ్రేణులు నెల్లూరు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే బంద్‌లో పాల్గొనకుండా నెల్లూరు నగరంలోని ముఖ్య నేతలందరినీ ఎక్కడికక్కడ పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

అట్టుడికిన నగరం
నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు

ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు

నాయకుల హౌస్‌ అరెస్టు

అయినప్పటికీ పలు చోట్ల శాంతియుత నిరసన

కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత


నెల్లూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడంతో బుధవారం ఆ పార్టీ శ్రేణులు నెల్లూరు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే బంద్‌లో పాల్గొనకుండా నెల్లూరు నగరంలోని ముఖ్య నేతలందరినీ ఎక్కడికక్కడ పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. మధ్యాహ్నం వరకు నాయకులను ఇళ్ల నుంచి బయటకు రానీయలేదు. 


అల్లీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని, మాగుంట లేఅవుట్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను, హరనాథపురంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ను, రాంజీనగర్‌లో నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని, లెక్చరర్స్‌ కాలనీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని, నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావును, తెలుగు యువత అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడును హౌస్‌ అరెస్టు చేశారు. వీరితో పాటు డివిజన్‌ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలను కూడా ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వేకువ జామునే ముఖ్య నేతల ఇళ్ల వద్దకు పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు నేతల ఇళ్ల వద్దకు తరలివచ్చారు. అయితే వీరందరినీ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. నగరంలో ని ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు మోహరించారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఓ వైపు అరెస్టులు, మరోవైపు ఆందోళనలతో నగరం అట్టుడికింది. 


కోటంరెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత

టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇంటి ముందు ఉదయం నుంచే పోలీసులు మోహరించారు. బంద్‌లో పాల్గొనకుండా కోటంరెడ్డిని అడ్డుకున్నా రు. అప్పటికే భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో బయటకొచ్చేందుకు కోటంరెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోటంరెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుపడ్డారు. వారందరని తప్పించి శ్రీనివాసులురెడ్డిని వేదాయపాళెం స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. బూతు రాజకీయాలు చేసేది, ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేసేది వైసీపీయే అని విమర్శించారు. మంత్రి అనిల్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నామని, ఆయనకు దమ్ముంటే ఎప్పుడు రావాలో సమయం, ప్రదేశం చెప్పాలని సవాల్‌ విసిరారు. 


రోడ్లపైకి నేతలు.. పోలీసుల అరెస్టులు

బంద్‌లో పాల్గొనకుండా పోలీసులు ఎక్కడికక్కడ నేతలను నిలువరించినప్పటికీ వారిని ఛేదించుకుని పలువురు నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలిపారు. నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో గుప్తాపార్కు సెంటర్‌ వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నశించే రోజు దగ్గర్లోనే ఉందని సుబ్బారావు పేర్కొన్నారు. నగర ప్రధాన కార్యదర్శి కొల్లూరు బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. నగర మైనారిటీ అధ్యక్షుడు సాబీర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో బుజబుజనెల్లూరు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరందరినీ పోలీసులు వేదాయపాళెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌ జలదంకి సుధాకర్‌ ఆధ్వర్యంలో ఏకే నగర్‌ పోస్టాఫీసు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారిని పోలీసులు దర్గామిట్ట స్టేషన్‌కు తరలించారు.  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు వీఆర్సీ సెంటర్‌ వద్ద ఆందోళనకు దిగారు.

Updated Date - 2021-10-21T04:29:42+05:30 IST