‘నారాయణ’లో విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-01T04:56:53+05:30 IST
నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థిని లక్ష్మీ లాలస (21) చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
4 ప్రసాద్ 31 : చున్నీతో ఉరివేసుకుని అత్మహత్య చేసుకున్న లక్ష్మీ లాలస
అనుమానాస్పదమన్న పౌరహక్కుల సంఘం
ఒత్తిడితో ఆత్మహత్య అని ఉత్తరం
లబోదిబోమన్న తల్లిదండ్రులు
నెల్లూరు (వైద్యం) అక్టోబరు 31 : నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థిని లక్ష్మీ లాలస (21) చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన శివారెడ్డి, వరలక్ష్మి దంపతుల రెండో కుమార్తె ఎర్రంరెడ్డి లక్ష్మీ లాలస (21) బీడీఎస్ నాల్గో సంవత్సరం చదువుతోంది. ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో ముగ్గురు విద్యార్థినులు ఉంటున్నారు. శనివారం రాత్రి వారంతా పక్క గదిలో పడుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని అత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పౌరహక్కుల సంఘం కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు ఆఽధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ విచారణ జరిపింది. ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని సంఘం అంటోంది. మృతిపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. లక్ష్మీ లాలస లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేవలం ఒత్తిడి వల్లే చనిపోయినట్లు లెటర్‌లో రాసినట్లు తెలుస్తోంది. రాత్రి చనిపోతే ఆదివారం మధ్యాహ్నం వరకు రూమ్‌మేట్లు అటువైపు వెళ్లక పోవటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కుమార్తె మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని గుండెలవీసేలా విలపించారు. వారి పెద్ద కుమార్తెకు వివాహమైంది. ఆఖరి కుమార్తె బీటెక్ చదువుతోంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.