చెరువులో ఈతకెళ్లి విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-03-15T04:40:51+05:30 IST

కావలి రూరల్‌ మండలం తాళ్లపాలెం చెరువుకు ఆదివారం ఈతకు వెళ్లిన విద్యార్థి పరుసు హనుమంతరావు (18) ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

చెరువులో ఈతకెళ్లి విద్యార్థి మృతి
చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికి తీస్తున్న స్థానికులు

కావలి రూరల్‌, మార్చి 14: కావలి రూరల్‌ మండలం తాళ్లపాలెం చెరువుకు ఆదివారం ఈతకు వెళ్లిన విద్యార్థి పరుసు హనుమంతరావు (18) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కావలి పట్టణం ముసునూరు అరుంధతీ వాడకు చెందిన హనుమంతరావు జేబీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం తరువాత హనుమంతరావు ముసునూరు దళితవాడకు చెందిన జనార్దన్‌, బన్నీ, రంజిత్‌లతో కలిసి తాటికాయలకు వెళ్లారు. అనంతరం అక్కడ చెరువు అలుగు వద్ద మునుగుతుండగా అక్కడ రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లకు మట్టి కోసం తవ్విన పెద్ద గుంట ఉండటంతో హనుమంతరావుకు ఈత రాక అందులో పడి మృతిచెందాడు. మిగిలిన ముగ్గురుకి ఈత రావటం వలన వారు ప్రాణాలతో బయట పడ్డారు. చెరువులో మునిగిన హనుంతరావు బయటకు రాకపోవటంతో తోటి విద్యార్థులు ఈ విషయాన్ని గ్రామంలోకి వచ్చి చెప్పటంతో గ్రామస్థులు వెళ్లి వలతో ఆ విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. రూరల్‌ ఎస్‌ఐ మాల్యాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి వెంకయ్యకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు కాగా అబ్బాయి మృతి చెందటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.

Updated Date - 2021-03-15T04:40:51+05:30 IST