ఆధార్‌(రం)లేని గిరిజనులు..!

ABN , First Publish Date - 2021-03-23T03:38:55+05:30 IST

సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డు ఉండాలి. అది ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుంటుంది. ఆధార్‌కార్డు లేకపోతే వారికి ఏ పథకం దరిచేరదు.

ఆధార్‌(రం)లేని గిరిజనులు..!
సంక్షేమ పథకాలకు నోచని గిరిజనులు

దరిచేరని ప్రభుత్వ పథకాలు

 ఎస్టీల బతుకులు దుర్భరం

తోటపల్లిగూడూరు, మార్చి 22: సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డు ఉండాలి. అది ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుంటుంది. ఆధార్‌కార్డు లేకపోతే వారికి ఏ పథకం దరిచేరదు. అలాంటి ఆధార్‌ కార్డుకు నోచని గిరిజనులు ఇప్పటికీ దుర్భర జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితి తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీలో నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 


తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ పాత కోడూరు నుంచి కొత్త కోడూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన సుమారు 25 గిరిజన (చల్లా యానాదులు) కుటుంబాలు  నివాసం ఉన్నాయి. వీరికి ఆధార్‌కార్డులు, ఓటర్‌ కార్డులు, చివరికి రేషన్‌కార్డులు కూడా లేవు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వీరిదరి చేరడం లేదు. వీరంతా తరచూ వలసలు వెళ్తుంటారు. కాబట్టి వీరి సంక్షేమం కోసం ఎవరూ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తం అవుతోంది. 25 ఏళ్ల నుంచి ఈ గిరిజనులు ఈ రోడ్డు పక్కనే నివాసం ఉంటున్నా జానాభా లెక్కల్లో లేకపోవడం విశేషం. కనీసం ప్రతినెలా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం, నిత్యావసర సరుకులకు వీరు నోచుకోలేదు. 2009లో ప్రారంభమైన ఆధార్‌ నమోదులో వీరికి అవకాశం లేదు. ఆధార్‌ అనేది ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్‌ వ్యవస్థ. 2016 మార్చి 11న ఆధార్‌ చట్టం లోక్‌సభలో ఆమోదం పొందడంతో ప్రభుత్వం ఆధార్‌ని తప్పనిసరి చేసింది. అన్నింటికీ అవసరమె ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆధార్‌కార్డులు ఈ గిరిజన కుటుంబాలకు లేకపోవడం గమనార్హం. ఈ 25 గిరిజన కుటుంబాలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జనసంచారం లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారనుకొంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు సంచరించే ప్రాంతంలో, ప్రతిరోజూ వేలాది వాహనాలు తిరిగే ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్లో పూరి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయిన్పప్పటికీ వీరి గురించి ఆలోచించే అధికారులు, నాయకులు ఎవరూ లేకపోవడం దురదృష్టకరం. చివరికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో ఒక్క రత్నానికి కూడా వీరు నోచుకోవడం లేదు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇస్తున్న ఇంటి నివేశన స్థలాలకు కూడా ఈ పేద గిరిజనులు నోచుకోలేదు.  ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని అంధకారంలో మగ్గుతున్న ఈ నిరుపేద గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


మా గురించి ఎవరూ పట్టించుకోరు

మా తాతముత్తాతల కాలం నుంచి ఈ గుడిసెల్లో బతుకుతున్నాము. మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. మా దగ్గరకూ ఎవరూ రాలేదు. కరోనా, లాక్‌డౌన్‌లో కూడా అధికారులు మమ్ములను పట్టించుకోలేదు. బిడ్డలతో సహా పస్తులు ఉన్నాం. దాతలు ఇచ్చిన బియ్యం కూరగాయలతోనే కాలం వెళ్లదీశాం. ఆధార్‌, రేషన్‌, ఓటు కార్డులు లేవు. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి ఒక్క సంక్షేమ పథకం కూడా తీసుకోలేదు. 

- పొన్నూరు మారయ్య




Updated Date - 2021-03-23T03:38:55+05:30 IST