సోమశిలకు జలకళ

ABN , First Publish Date - 2021-07-25T04:32:08+05:30 IST

ఈ ఏడాది ముందుగానే పెన్నాకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాలైన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో వర్షాలు కురుస్తుండడంతో ఆ నీరంతా పెన్నాకు చేరుతోంది.

సోమశిలకు జలకళ
55 టీఎంసీలకు చేరువైన సోమశిల జలాశయం

ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు

ఈ ఏడాది ముందుగానే మొదలైన ఇన్‌ఫ్లో

ఇప్పటికే జలాశయానికి పది టీఎంసీల చేరిక

సరైన ప్రణాళికతోనే నీటి యాజమాన్యం

కండలేరుకు విడుదల చేస్తే ప్రయోజనం


నెల్లూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ముందుగానే పెన్నాకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాలైన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో వర్షాలు కురుస్తుండడంతో ఆ నీరంతా పెన్నాకు చేరుతోంది. దీంతో సోమశిల జలకళను సంతరించుకుంటోంది. ఈ నెలలో ఇప్పటికే సుమారు పది టీఎంసీల వరకు నీరు చేరింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా శనివారం ఉదయానికి అది 11 వేల క్యూసెక్కులకు పెరిగింది. శుక్రవారం సోమశిలలో 52.480 టీఎంసీలు ఉన్న నిల్వ శనివారానికి 53.380 టీఎంసీలకు చేరింది. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సోమశిలకు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పుడే వరద వస్తోందంటే ఇక సీజనైన సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో ఈ దఫా కూడా భారీగానే వరద వచ్చే అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 


54 టీఎంసీల నీరు


సోమశిల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు. కాగా ప్రస్తుతం 54 టీఎంసీల వరకు నీరుంది. ఇంకా 24 టీఎంసీలను నిల్వ చేసుకునేందుకు వీలుంది. అలానే మరో 10-15 టీఎంసీలను రెండో పంటకు, తాగునీటికి విడుదల చేయాల్సి ఉంది. దీంతో ఈ సీజన్‌కు మొత్తంగా మరో 40 టీఎంసీలకు మించి సోమశిలకు అవసరం ఉండదు. అలానే కండలేరు పూర్తి నిల్వ సామర్థ్యం 68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రస్తుతం క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి 1950 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా 1840 క్యూసెక్కులను కాలువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత సామర్థ్యంతో పాటు రెండో పంట, చెన్నైకు తాగునీరు విడుదల చేస్తే మరో 40 టీఎంసీల వరకు నీరు నిల్వ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సోమశిలకు ముందుగానే ఇన్‌ఫ్లో వస్తోంది కాబట్టి అక్కడి నుంచి కండలేరు నీటి విడుదల చేస్తే ప్రయోజనముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సోమశిల - కండలేరు వరద కాలువ సామర్థ్యం 12 వేల క్యూసెక్కులు మాత్రమే. ఆ కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయడం సాధ్యపడదు. అంటే రోజుకు ఒక టీఎంసీకు మించి సోమశిల నుంచి కండలేరుకు తరలించ డానికి వీలుపడదు. ఒక వేళ సోమశిలకు గతేడాది మాదిరిగా భారీ వరద వచ్చినా సముద్రానికి వదలడం తప్ప ఆ నీటిని ఉపయోగించుకునే అవకాశముండదు. ఈ క్రమంలో ముందు నుంచే కండలేరును నింపుతూ వస్తే రబీ సీజన్‌ ప్రారంభయ్యే నాటికి రెండు జలాశయాలు పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉంటా యని అంచనా వేస్తున్నారు. తద్వారా మరోసారి జిల్లాలోని పూర్తి ఆయకట్టుకు రెండు పంటలు పండించేందుకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాగా గతేడాది వరకు పెన్నా పరివాహకంలో వర్షాలు కురవకపో యినప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా జలాలను సోమశిలకు తరలిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కీలకమైన శ్రీశైలం జలాశయంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, నిప్పులవాగులు కృష్ణా నీటి యాజమాన్య బోర్డు పరిధిలోకి వెళ్లాయి. ఇక నీటి విడుదల వ్యవహారాలను బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో కృష్ణా జలాలను జిల్లాకు తీసుకురావడం అంత సులువైన విషయం కాదని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమశిలకు వస్తున్న ప్రతీ చుక్కనూ జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై, పాలకులపై ఉంది. 


కండలేరుకు విడుదలపై ఆలోచిస్తున్నాం 


 సోమశిలకు వస్తున్న ఇన్‌ఫ్లోను చూసి నీటి విడుదల ప్రారంభిస్తాం. 10 వేల క్యూసెక్కులపైన ఇన్‌ఫ్లో కొనసాగితే సోమశిల నుంచి కండలేరుకు నీటి విడుదల మొదలుపెడ తాం. సోమశిల - కండలేరు వరద కాలువ విస్తరణ పనులు జరుగుతున్నాయి. నీరు విడుదల చేసినప్పటికీ ఈ పనులకు ఆటంకం కలగదు. 

- హరినారాయణరెడ్డి, జలవనరుల శాఖ సీఈ


పెరిగిన వరద


55 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ


అనంతసాగరం, జూలై 24: రాయలసీమలో కురుస్తున్న వర్షాలకు సోమశిలకు వచ్చే వరద ప్రవాహం పెరిగింది. 96.861 మీటర్లతో 53.380 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అదికారులు తెలిపారు. వస్తున్న వరదతో సోమశిల నీటి మట్టం రెండు రోజుల్లో 55 టీఎంసీలు చేరుకోనుంది. ప్రస్తుతం దిగువ ఉత్తర కాలువకు 80, దక్షిణ కాలువకు 130, డెల్టాకు 920 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు వారు వివరించారు.


Updated Date - 2021-07-25T04:32:08+05:30 IST