శిథిల భవనంలో ‘సంక్షేమ’మేనా?
ABN , First Publish Date - 2021-01-21T05:03:08+05:30 IST
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో వసతి గృహాల భవనాల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది.

కూలే స్థితిలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం
ఏళ్ల తరబడి సొంత భవనం కరువు
దెబ్బతిన్న హాస్టల్లో కార్యకలాపాలు
కోట్ల విలువైన స్థలం ఉన్నా కొలిక్కిరాని కోర్టు కేసు
నెల్లూరు (వీఆర్సీ), జనవరి 20 : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో వసతి గృహాల భవనాల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే హాస్టల్కే పనికిరాదని నిర్ధారించిన శిథిల భవనంలో ప్రస్తుతం కార్యాలయం నిర్వహిస్తుండటంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం కొన్నేళ్ల క్రితం వరకు నెల్లూరులోని సుబేదారుపేటలో ఉన్న అంబేద్కర్ సంక్షేమ భవనంలో ఉండేది. అయితే ఆ భవనం శ్లాబు పెచ్చులూడి పడిపోవడంతో కార్యాలయాన్ని కొండాయపాళెం గేటు సమీపంలో ఖాళీగా ఉన్న హాస్టల్ భవనంలోకి మార్చారు. అప్పటికే ఆ భవనాలు పాడుబడిపోవడంతో వాటిలో నిర్వహిస్తున్న వసతి గృహాలను వేరే చోటుకి తరలించారు. అక్కడ గతంలో మూడు బాలుర హాస్టళ్లు ఉండేవి. ప్రస్తుతం ఆ ప్రాంగణంలో ఒక హాస్టల్, డీడీ కార్యాలయం నడుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గదులన్నీ ఉరుస్తున్నాయి. సూపరింటెండెంట్ గది, కంప్యూటర్ సెక్షన్ తలుపులు దెబ్బతినడంతో వాటి స్థానంలో చెక్కలు అడ్డుగా ఉంచారు. ఈ భవనాన్ని చూసిన వారంతా ఇది ఒక శాఖ జిల్లా కార్యాలయం అంటే ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. అయినా కొత్త భవనానికి మోక్షం కలగడంలేదు.
కోర్టులో కేసులో కోట్ల విలువైన స్థలం
సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కోట్ల విలువైన స్థలం ఏళ్ల తరబడి జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉండిపోయింది. కొండాయపాళెం గేటు సమీపంలోని ఉమ్మారెడ్డిగుంటలో సుమారు అర ఎకరా స్థలాన్ని ఈ శాఖకు ప్రభుత్వం కేటాయించింది. గతంలో ఆ భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉండడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగికి మంజూరు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత చుట్టుపక్కలంతా నివాసాలు ఏర్పడడంతో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించిందని తెలిసింది. ఇంజనీరింగ్ విభాగం ఆ భూమి చుట్టూ ఎత్తయిన ప్రహరీకూడా నిర్మించింది. అయితే గతంలో తనకు కేటాయించిన ఈ భూమి తనకే చెందాలని సదరు ప్రభుత్వ ఉద్యోగి కోర్టుకు వెళ్లడంతో అప్పటి నుంచి వ్యాజ్యం నడుస్తోంది. అధికారులు చొరవ చూపకపోవడంతో దానికి పరిష్కారం లభించడం లేదు. ప్రస్తుతం ఆ స్థలం పిచ్చి మొక్కలతో నిండి చిట్టడవిని తలపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కార్యాలయానికి సురక్షితమైన శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరుతున్నారు.
