సార్... పేపర్!
ABN , First Publish Date - 2021-09-04T04:33:13+05:30 IST
తొలి సంధ్యవేళ కోడి కూయకముందే ఇంటి ముందుకు అతిథిలా వస్తాడు.

చీకటి తెరలు చీల్చుకుంటూ హాట్ న్యూస్‌తో ముందుకు..
ప్రపంచాన్ని ఇంటికి తీసుకొచ్చే అతిథిలా..
నేడు ప్రపంచ పేపర్ బాయ్స్ దినోత్సవం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), సెప్టెంబరు 3 : తొలి సంధ్యవేళ కోడి కూయకముందే ఇంటి ముందుకు అతిథిలా వస్తాడు. జోరువానలోనూ... ఎముకలు కొరికే చలిలోనూ తానెవరో సమాజానికి కనిపించకుండా సైకిల్‌పై వచ్చి నిత్యనూతన సమాచారాన్ని అందించే తొలి సామాజిక కార్యకర్త అతడు. చీకటి తెరలను చీల్చుకుంటూ పేపర్ చేతిలో పెట్టుకుని ప్రతి ఇల్లూ తిరుగుతూ ‘‘సార్.. పేపర్’’ అంటూ వేడి వేడి వార్తలను మన ముంగిటకు చేర్చే కనిపించని వ్యక్తే పేపర్ బాయ్.. తొలి పేపర్ బాయ్‌గా గుర్తింపు పొందిన బార్నీ ప్లాహెర్డీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబరు 4న అంతర్జాతీయ పేపర్‌బాయ్ దినోత్సవం జరుపుతున్నారు.
కత్తిమీద సాములాంటిదే
పేపర్‌బాయ్ పని అంటే.. ఏదో పేపర్లు తీసుకొని ఉదయం ఇళ్ల వద్ద వేసి వెళ్లిపోతారని అనుకుంటారు అంతా. అయితే ఇందులో ఉన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎందరో పాత్రికేయులు రేయింబవళ్లు శ్రమించి సేకరించిన వార్తలను సబ్‌ఎడిటర్లు సరిచేసి ముద్రణ ఆమోదయోగ్యంగా మలుస్తారు. ఆ తర్వాత ముద్రించబడ్డ దిన పత్రికలను పాఠకులకు చేరవేయాల్సిన బాధ్యత పేపర్‌బాయ్‌లదే. తెల్లవారు జామున 3.30 గంటలకు ముందే పేపర్‌బాయ్‌లు నిద్రలేచి సైకిల్‌పై బయలుదేరి పేపర్ కట్టలు వచ్చే పాయింట్లకు చేరుకుంటారు. దినపత్రికలను సర్దుకున్నాక పై అంతస్థులో ఉన్న ఇళ్లకు పేపర్‌ను ఎగర వేసేందుకు తాడుతోనూ, పేపర్‌నే పొట్లంగా మలిచి ఆ కట్టలను సైకిల్‌పై సర్దుకుని బయలు దేరుతారు. తమ ఖాతాదారులకు పత్రికలు వేసుకుంటూ ముందుకు సాగిపోతారు. పేపర్ వేసే క్రమంలో సైకిల్ లేదా ద్విచక్ర వాహనం మరమత్తులకు గురవడం, ఆరోగ్యం బాగలేక నిద్రలేవడం ఆలస్యమైతే ఇక తిట్ల దండకాలే. బిల్లులు సకాలంలో వసూలు చేయకపోతే ఏజెంట్లు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయడం ఇలా చాలా బాధలే ఉన్నాయి.
ఎందరో మహనీయులు
భారత రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యార్థి దశలో పేపర్‌బాయ్‌గా పని చేశారు. తన విద్యార్థి దశలో పుస్తకాల ఖర్చుల కోసం తెల్లవారుజామునే లేచి ఇంటింటా పేపరు వేసేవారు. ఇక ప్రఖ్యాత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రాపూరి భరద్వాజ కూడా పేపర్‌బాయ్‌గా పని చేశారు. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో బాలగంగాధర్ తిలక్ సైతం పీపుల్స్‌వార్ పత్రికకు కొన్నాళ్లపాటు పేపర్‌బాయ్‌గా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు, మహాను బావులు పేపర్‌బాయ్‌లుగా పనిచేసిన వారే.
పార్ట్‌టైమ్ జాబ్‌లా...
పేపర్‌బాయ్ జాబ్ చేయడం చాలెంజ్‌గా ఉంటుంది. ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచి ఫీల్డ్‌మీదకు వెళ్లి 7 గంటలకు ఇంటికి వచ్చేస్తాము. అక్కడ నుంచి మాకున్న ఇతర పనులను చూసుకుంటాము. పార్ట్‌టైమ్ జాబ్‌గా చేస్తున్నా మొదట్లో ఉదయాన్ని నిద్రలేవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది.
- నాగరాజు, పేపర్‌బాయ్
నా సొంత ఖర్చుల కోసం..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావాలన్నది నా లక్ష్యం. ఇప్పుడు బీటెక్ చదువుతున్నా. నా సొంత ఖర్చుల కోసం ఇంట్లోవారి మీద ఆధారపడకుండా పార్ట్‌టైమ్ జాబ్‌గా పేపర్ బాయ్ ఉద్యోగంలో చేరా. తెల్లవారుజాము 3 నుంచి 7 గంటలకు పూర్తవుతుండటంతో నా కళాశాలకు, కోచింగ్‌లకు ఎలాంటి ఇబ్బంది లేదు.
- మద్దినేని వివేక్