అధ్వానంగా సర్వీస్‌ రోడ్డు

ABN , First Publish Date - 2021-12-26T04:50:14+05:30 IST

స్థానిక సొసైటీ సెంటర్‌ నుంచి రైల్వే గేటు వరకు ఉన్న సర్వీసు రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధ్వానంగా సర్వీస్‌ రోడ్డు
అధ్వానంగా సర్వీసురోడ్డు

 అవస్థలు పడుతున్న వాహనదారులు

గూడూరు, డిసెంబరు 25: స్థానిక సొసైటీ సెంటర్‌ నుంచి రైల్వే గేటు వరకు ఉన్న సర్వీసు రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం వాహనదారులకు సౌకర్యంగా ఉండేలా  సర్వీస్‌రోడ్డును ఏర్పాటు చేశారు. 2011లో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు చేపట్టినా నేటికి అసంపూర్తిగా  ఉన్నాయి. దీంతో ఈ సర్వీస్‌రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు.         ఒకటో, రెండో పట్టణాలకు వేళ్లే వారు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలకు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌, సిరామిక్‌, ప్రభుత్వ ఐటీఐ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు,  ఓ ప్రైవేటు కార్మాగారానికి వెళ్లే ఉద్యోగులు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగించాలి. దీంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సర్వీస్‌రోడ్డు రాళ్లుతేలి గుంతలమయంగా మారడంతో రాకపోకలు సాగించాలంటే అవస్థలు పడుతున్నామని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయగా మారి నీరునిల్వ చేరడంతో బురదమయంగా మారింది. ప్రైవేటు కర్మాగారానికి వెళ్లే భారీవాహనాలు ఈ మార్గంలో వెళుతూ బురదమయంగా మారిన రోడ్డులో ఇరుక్కుపోతున్నాయి. దీంతో క్రేన్‌లు, ఎక్సకవేటర్ల సాయంతో వాహనాలను లాగాల్సి వస్తున్నది. రాత్రి సమయాలలో పనులు ముగించుకుని వెళ్లేవారు గుంతలు కనిపించక ప్రమాదాలకు లోనవుతున్నారు. నిత్యం ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులకు అసౌకర్యం కలగకుండా సర్వీసు రోడ్డును అభివృద్ధి పరచాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-12-26T04:50:14+05:30 IST