ఎస్సీ , ఎస్టీలంటే అర్థం తెలియదా ?
ABN , First Publish Date - 2021-12-31T06:13:05+05:30 IST
ఎస్సీ, ఎస్టీలంటే అర్థం తెలుసా?, అది కూడా తెలియకుండా మీరెలా కమిషనర్లు అయ్యారు..

మీరెలా కమిషనర్లు అయ్యారు
విద్యా విధానం మారాలి
కేంద్ర బోర్డు సభ్యుడు నరసింహం
నెల్లూరు (వీఆర్సీ), డిసెంబరు 30 : ఎస్సీ, ఎస్టీలంటే అర్థం తెలుసా?, అది కూడా తెలియకుండా మీరెలా కమిషనర్లు అయ్యారు.. అంటూ కేంద్ర డీనోటిఫైడ్ సంచార, అర్ధ సంచార జాతుల అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యుడు తుర్కా నరసింహం మున్సిపల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం జిల్లా పరిషత్ హాలులో రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పోలీసు, అటవీ, మున్సిపల్ శాఖల అధికారులతో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా వారు అమలు చేస్తున్న కార్యక్రమాల ను అడిగి తెలుసుకున్నారు. సమావేశం ఆద్యంతం సమీక్ష లేకుండానే ఉన్నతాధికారుల విద్యార్హతలను బట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సమావేశానికి హాజరు కాకుండా కింది స్థాయి అధికారి రావడంతో నరసింహం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్లను ఉద్దేశించి ఎస్సీ, ఎస్టీలంటే ఏమిటి అని ప్రశ్నించారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబ్స్ అని వారి నుంచి సమాధానం రావడంతో ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలంటే అర్థం తెలియదా? మరి ఆ వర్గాల కోసం ఎలా పనిచేస్తారు మీరంతా, మీరెలా కమిషనర్లు అయ్యారు?, నేనేమైనా పనికిమాలిన వాడినా, పనీపాట లేకుండా జిల్లాకు వచ్చాననుకున్నారా? అంటూ అగ్ర హం వ్యక్తం చేశారు. విద్య విధానంలో సమూల మార్పు రావాలని, సీబీఎస్‌ఈ విధానా న్ని అమలు చేస్తే అందరికీ సమానంగా విద్య అందుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూతన ఒరవడిని అందుకోలేకపోతున్నారన్నా రు. అనంతరం పోలీసు శాఖకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎన్ని నమోదయ్యాయి. అసలైన కేసులు ఎన్ని, తప్పుడు కేసులు ఎన్ని, బాధితులకు పరిహారం అందించారా... లేదా.. వంటి వివరాలను మెయిల్ ద్వారా పంపాలని ఆదేశించారు. అటవీ చట్టాలు గిరిజనులకు ఉపయోగపడుతున్నాయా? అని జిల్లా అటవీ అధికారిని ప్రశ్నించారు. సంచార జాతులకు అనాదిగా భూములు లేవని, ఒక వేళ ఉంటే అవి వారి అధీనంలో ఉన్నాయా... లేవా అనే వివరాలు సమర్పించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి సమావేశానికి రాలేరని, ఆయన దూతగా సభ్యులు వస్తారని ప్రధానికిచ్చిన గౌరవం సభ్యులకూ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో చిన ఓబులేశు, డీఎఫ్‌వో షణ్ముఖకుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) రోజ్‌మండ్, ఏఎస్పీ వెంకటరత్నం, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, డీఈవో రమేష్, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, ఐటీడీఏ పీవో కనకదుర్గాభవానీ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు పాల్గొన్నారు.