ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2021-09-04T03:33:48+05:30 IST

సోమశిల సమీపంలోని పడమటికంభంపాడు ఇసుక రీచ్‌లో భారీగా అక్రమాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగంలో చలనం లేదు. ప్రభుత్వ అనుమతి

ఇసుక దోపిడీ

    పీకేపాడు రీచ్‌లో నిబంధనల ఉల్లంఘన

 10 నుంచి 15 అడుగుల మేర గోతులు

 కన్నెతి చూడని అధికారులు

అనంతసాగరం, సెప్టెంబరు 3: సోమశిల సమీపంలోని పడమటికంభంపాడు ఇసుక రీచ్‌లో భారీగా అక్రమాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగంలో చలనం లేదు. ప్రభుత్వ అనుమతి పేరిట నిబంధనలు ఉల్లంఘించి ఇసుక దోపిడీ సాగు తోంది. ఇసుక రీచ్‌లకు సంబంధించిన వ్యవహారం వెనుక వైసీపీ పెద్దలు ఉండడం తో జిల్లా అధికారులు రీచ్‌ల వైపు కన్నెతి చూడని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలోని 14 రీచ్‌లను ప్రభుత్వం జేపీ పవర్‌ వెంచర్‌ సంస్థకు అప్పగించింది. నిబంధనలకు లోబడి తవ్వకాలు జరపాల్సి ఉండగా నిబంధనలు పాటించడం లేదు. పడమటికంభంపాడు ఇసుక రీచ్‌లో 10 ఎక్స్‌కవేటర్లను పెట్టి 10 నుంచి 15 అడుగుల లోతు తవ్వడంతో భూగర్భజలాలు బయటపడుతున్నాయి. పెన్నా నదిలో మీటరుకు మించి తవ్వకాలు జరపకూడదన్న నిబంధనలు ఏ మాత్రం పాటించని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. 

బోర్లకు అందని నీరు.. రైతుల్లో ఆందోళన

పీకేపాడు ఇసుక రీచ్‌లో తవ్వకాలను పరిశీలిస్తే భవిషత్తులో సమీప సోమశిల, పీకేపాడు, కమ్మవారిపల్లి, ఉప్పలపాడు గ్రామాల్లో భూగర్భ జలాలు అందని పరిస్ధి తి కనిపిస్తుంది. ఈ క్రమంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా ఇప్పటికే కొన్ని బోర్లకు నీరు అందని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. ఇలాగే మరికొంతకాలం పీకేపాడు రీచ్‌లో తవ్వకాలు జరిగేతే తమ పొలా లు బీడులుగా మారడం ఖాయమని రైతులు ఆవేదన వక్తం చేస్తున్నారు.

జలాశయానికి పొంచిఉన్న ముప్పు 

సోమశిల జలాశయానికి కూతవేటు దూరంలోనే ఇసుక దోపిడీ జరుగుతుంది. ఈ తవ్వకాల కారణంగా భవిష్యత్తులో జలాశయానికి ముప్పు ఉంటుందేమోనన్న భయం ప్రజలను వెంటాడుతుంది. పీకేపాడు రీచ్‌లో తవ్వకాలు సోమశిల డ్యాంకు ముప్పు తెచ్చేలా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిపుణుల కమిటీ క్షేతస్థాయిలో అధ్యయనం చేయాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతుంది.

Updated Date - 2021-09-04T03:33:48+05:30 IST