బయోమెట్రిక్‌ షాక్‌

ABN , First Publish Date - 2021-10-29T04:45:25+05:30 IST

రెండేళ్లు ప్రొబేషనరీ పూర్తి చేస్తుకుని పర్మినెంట్‌ కోసం ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్‌తో ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

బయోమెట్రిక్‌ షాక్‌

సచివాలయ ఉద్యోగులకు వేతనంలో కోత

రెండేళ్లు పూర్తయినా పర్మినెంట్‌ కాని వైనం

సెలవు రోజుల్లో పనికిలేని వేతనం

ఆవేదనలో బాధితులు


సంగం, అక్టోబరు 28 : రెండేళ్లు ప్రొబేషనరీ  పూర్తి చేస్తుకుని పర్మినెంట్‌ కోసం ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్‌తో ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఉన్నత చదువులు చదివి సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో వేలకు వేలు జీతాలు తీసుకునేవారు సైతం ప్రభుత్వ ఉద్యోగమని సచివాలయ  ఉద్యోగాలకు వచ్చారు. ప్రస్తుతం తక్కువ వే తనమైనా ప్రొబేషనరీ పీరియడ్‌ పూర్తి చేసుకుంటే మంచి వేతనం వస్తుందని ఆశపడ్డారు. కానీ ఉద్యోగ నియామకా లప్పుడు చెప్పిన మాటలకు, వాస్తవ పరిస్థితికి ఎంతో తేడా ఉంది. బయోమెట్రిక్‌ కారణం చూపుతూ తాజాగా వేతనాల్లో కోత విధించడం సచివాలయ ఉద్యోగులను ఆవేదనకు గురిచేస్తున్నది.


పర్మినెంట్‌ కోసం ఎదురుచూపు


జిల్లావ్యాప్తంగా 660 సచివాలయాలు ఉన్నాయి.  వీటిలో సుమారు 8 వేలమంది పనిచేస్తున్నారు. ప్రొబేషనరీ పీరియడ్‌లో నెలకు రూ. 15 వేల వేతనంతో వీరిని నియమించారు. రెండేళ్ల తరువాత పర్మినెంట్‌ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మధ్యలో డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే పర్మినెంట్‌ చేస్తామని చెప్పడంతో చాలామంది పరీక్షలు రాసి విజయం సాధించారు. వారంతా పర్మినెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.


వేతనంలో కోత


సచివాలయ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్‌ వేయాలని ప్రభుత్వం షరతు విధించింది. వీరిలో కొంతమంది  తమ విధుల్లో భాగంగా రక్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉంది. వీరు కూడా బయోమెట్రిక్‌ వేయాలని, ఏ కారణంతో చేతనైనా వేయకపోతే ఆరోజు జీతంలో కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో గత నెల 23 నుంచి ఈనెల 22 వరకు విధుల్లో ఉన్న సచివాలయ సిబ్బందికి వేతనంలో కోత పడినట్లు చూపుతున్నారు. బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనంలో కోత విధించినట్లు తెలుసుకుని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా వేలాదిమంది జీతాల్లో కోత విధించి బిల్లులను ట్రెజరీలకు అందజేశారు. మరోవైపు వారికి సెలవు రోజుల్లోనూ వివిధ పనులను అప్పగిస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రత్యేక విధులకూ వారిని వినియోగించారు. నేడు బయోమెట్రిక్‌ హాజరు చూపి ఉన్నఫళంగా వేతనంలో కోత పెట్టడంతో ఉద్యోగులంతా అయోమయంలో పడ్డారు. బయోమెట్రిక్‌ పరికరాలు నేటికీ సరిగా పనిచేసిన దాఖలాలు లేవు. ఒకరోజు హాజరు పడితే.. మరోరోజు గంట ఆలస్యంగా పరికరాలు పనిచేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి నెట్‌ పనిచేయక.. సిగ్నల్‌ లేక కొన్ని రోజులు బయోమెట్రిక్‌ వేయలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.


ప్రభుత్వ పథకాలకూ దూరం


సచివాలయ ఉద్యోగుల తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్‌, రేషన్‌కార్డులతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు అర్హత లేకుండా చేశారు. రెండేళ్లు పూర్తయిన వెంటనే పర్మినెంట్‌ ఉద్యోగులుగా మారుస్తామని చెప్పి, ఇప్పుడు పర్మినెంట్‌ చేసేందుకు మళ్లీ పరీక్షలు పెట్టారు. వాటి ఫలితాలు కూడా వచ్చాయి. తర్వాత పరిస్థితి ఏమిటో వారికే అర్థం కావడం లేదు. అంతలోనే బయోమెట్రిక్‌ కారణం చూపి వేతనంలో కోత విధించడంతోపాటు ఇంతకుముందు అమ లవుతున్న  సంక్షేమ కార్యక్రమాల్లో కూడా కోత పెట్టారు.  దీంతో ఏం చేయాల్లో దిక్కుతెలియక సచివాలయ ఉద్యోగులు అల్లాడుతున్నారు. పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి వేతనాల్లోకోత లేకుండా చూడాలని, తమను పర్మినెంట్‌ చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-10-29T04:45:25+05:30 IST