రెవెన్యూలో అలజడి!

ABN , First Publish Date - 2021-09-03T04:49:49+05:30 IST

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు జిల్లా రెవెన్యూ వర్గాల్లో తీవ్ర అలజడ రేపింది.

రెవెన్యూలో అలజడి!
వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ ఎర్రగుంట గ్రామ పరిధిలో దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాస కేంద్రం

హైకోర్టు తీర్పుతో అధికారుల్లో కుదుపు

బాధితురాలికి భూ పరిహారం చెల్లింపులో జాప్యం

న్యాయస్థానం ఆదేశించినా బేఖాతర్‌!

నలుగురు ఐఏఎస్‌లకు జైలు, జరిమానా

వీరిలో పూర్వ కలెక్టర్లు ముత్యాలరాజు, శేషగిరిబాబు

ఉలిక్కిపడ్డ జిల్లా రెవెన్యూ యంత్రాంగం


నెల్లూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు జిల్లా రెవెన్యూ వర్గాల్లో తీవ్ర అలజడ రేపింది. బాధితురాలికి పరిహారం చెల్లింపులో కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా అసాధారణ జాప్యం చేశారన్న అభియోగాలపై గురువారం రాష్ట్ర హైకోర్టు నలుగురు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ కేసులో జిల్లాలో పనిచేసిన పూర్వ కలెక్టర్లు ముత్యాలరాజు, శేషగిరిబాబులు ఉండటం, జిల్లాలో జరిగిన ఘటనే ఈ తీర్పునకు కారణం కావడంతో రెవెన్యూ వర్గాల్లో సంచలనం సృష్టించింది. 


నేపథ్యం ఇదీ...


 వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ ఎర్రగుంట గ్రామ పరిధిలో దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాస కేంద్రం 2016లో మంజూరవగా, 2019లో ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఇనిస్టిట్యూట్‌ కోసం రెవెన్యూ ఽఅధికారులు పది ఎకరాల అసైన్డ్‌ భూమి కేటాయించగా, అదే గ్రామానికి చెందిన తాళ్లపాక సావిత్రమ్మకు చెందిన మూడు ఎకరాలు కూడా అందులో  కలిసిపోయింది. ఇదీ అసైన్డ్‌ భూమే. ఎస్సీ కులానికి చెందిన సావిత్రమ్మకు సర్వే నెం.943లో ప్రభుత్వం 3 ఎకరాలు పట్టా ఇచ్చింది. దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధికి కేంద్రానికి భూమిలో తన భూమినీ కలిపి సరిహద్దు రాళ్లు నాటారని సావిత్రమ్మ రెవెన్యూ అధికారులకు విన్నవించుకుంది. అయితే, అధికారులు పట్టించుకోకపోవడంతో సావిత్రమ్మ తొలుత లోకాయుక్తలో కేసు వేసింది. ఆ తరువాత తనకు న్యాయం చేయాలంటూ హై కోర్టును ఆశ్రయించింది.


పరిహారం ఇవ్వాలన్నా..


సావిత్రమ్మకు చెందిన భూమికి కూడా నష్టపరిహారం చెల్లించాలని 2017లో హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును జిల్లా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో 2018లో సావిత్రమ్మ కోర్టు ధిక్కార నేరం కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి గురువారం హై కోర్టు తీర్పు వెల్లడించింది. 2017 నుంచి 2021 మధ్య కాలంలో జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ముత్యాలరాజు, శేషగిరిబాబులకు వారం రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. అలాగే ఆ నాలుగేళ్ల కాలంలో సీసీఎల్‌ఏ, ప్రిన్సిపల్‌ సెక్రటరీలుగా పనిచేసిన ఐఎఎస్‌ అధికారులు మన్మోహన్‌సింగ్‌, ఎస్‌.ఎస్‌. రావత్‌లకు నెల రోజులు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. శిక్షపై అప్పీలు చేసుకునేందుకు నెల రోజులు గడువు ఇస్తూ, అప్పీలు గడువు ముగిసే వరకు శిక్షను వాయిదా వేసింది. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే సావిత్రమకు ఎకరాకు రూ.13లక్షలు చొప్పున మూడు ఎకరాలకు రూ.39 లక్షలు పార్వతమ్మకు చెల్లించారు. ఆ క్రమంలోనే ప్రస్తుత కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు హై కోర్టు శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చింది.


అధికార వర్గాల్లో కుదుపు 


నలుగురు ఐఏఎస్‌ అధికారులకు వ్యతిరేకంగా గురువారం వెలువడిన తీర్పు జిల్లా అధికార వర్గాల్లో కుదుపు తెచ్చింది. ఎన్నడూ లేని విధంగా నెల్లూరు కేంద్రంగా పనిచేసిన ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష పడటం అధికార వర్గాల్లో అలజడి రేపింది. న్యాయస్థానాలను, తీర్పులను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో జిల్లా యంత్రాంగానికి తెలిసివచ్చినట్టు అయ్యింది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా అధికారుల తీరు మారింది. చట్టానికి లోబడి పని చేయకుండా, అధికారంలో ఉన్న నాయకుల ఆదేశాలకు లోబడి పని చేస్తున్నారు. గడచిన రెండేళ్ల కాలంలో మరీ ఎక్కువగా ఇలాంటి  ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అధికారంలో ఉన్న నాయకులు చెప్పిందే శిరోధార్యంగా పలువురు అధికారులు అడ్డదిడ్డంగా పనులు చేస్తున్నారు. అన్యాయానికి అండగా నిలబడుతున్నారు. కోర్టు తీర్పులను సైతం లెక్కచేయని టెంపరితనం కొందరు అధికారుల్లో కనిపిస్తోంది. కిందిస్థాయి అధికారులు చేసే తప్పులకు చివరికి ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తోంది. గురువారం వెలువడిన తీర్పుతోనైనా రాజకీయ సిపార్సులకు లొంగి తప్పులు చేసే అధికారుల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకొంటున్నారు.  

Updated Date - 2021-09-03T04:49:49+05:30 IST