అన్నీ తప్పులు.. అంతా గందరగోళం

ABN , First Publish Date - 2021-12-29T05:03:10+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వాహన రిజిసే్ట్రషన్ల వ్యవహారంపై కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

అన్నీ తప్పులు.. అంతా గందరగోళం
రికార్డును పరిశీలిస్తున్న విచారణ అధికారి ఏలూరు డీటీసీ సిరి ఆనంద్‌

వాహనాల అక్రమ రిజిస్ర్టేషనపై కమిటీ విచారణ

ఉదయం నుంచి రాత్రి వరకు ఆరా


నెల్లూరు(క్రైం)/గూడూరు/సూళ్లూరుపేట, డిసెంబరు 28 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వాహన రిజిసే్ట్రషన్ల వ్యవహారంపై కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరుణాచల్‌ప్రదేశ వాహనాలకు గూడూరు ఆర్టీవో కార్యాలయ పరిధిలోని సూళ్లూరుపేటలో అక్రమ రిజిసే్ట్రషన చేసిన వాహనాల వ్యవహారంపై వేసిన విచారణ కమిటీ మంగళవారం జిల్లాకు వచ్చింది. కమిటీ అధికారి తూర్పుగోదావరి డీటీసీ సిరి ఆనంద్‌ ఉదయం నుంచి రాత్రి వరకు సూళ్లూరుపేట, గూడూరు ఆర్టీవో కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. కార్యాలయాల్లోని పలువురు సిబ్బందిని విచారించారు. గూడూరులో ప్రతిఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె ఆర్టీవో మల్లిఖార్జునరెడ్డిని 20 నిమిషాలకుపైగా ఒకే గదిలో ఉంచి విచారించారు. సూళ్లూరుపేట రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయంలోనూ ఆమె రికార్డులను పరిశీలించి, అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీటీసీ చందర్‌, ఎంవీఐ మురళీమోహన, ఏఎంవీఐ శేషురెడ్డి ఉన్నారు.


పూర్తిస్థాయిలో విచారణ


ప్రభుత్వ ఆదేశాలతో వాహనాల రిజిసే్ట్రషన్ల గోల్‌మాల్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని విచారణ అధికారి సిరి ఆనంద్‌ తెలిపారు. సూళ్లూరుపేటలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఆనలైనలో నమోదైన ప్రకారం 83 వాహనాలకు సంబంధించి రిజిసే్ట్రషన్లలో కొంత గందరగోళం ఉందని చెప్పారు. దీంతోపాటు సదరు వాహన వివరాలు, అడ్రస్సులు సైతం తప్పులు ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలిసిందని అన్నారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరమే వివరాలు తెలుపుతామన్నారు. ఈ కేసులో ఇతర కార్యాలయ సిబ్బంది పాత్రపై సైతం విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలను ప్రభుత్వానికి తెలుపుతామని వెల్లడించారు. ఆమె వెంట ఎంవీఐ రఫీ కూడా ఉన్నారు. 

Updated Date - 2021-12-29T05:03:10+05:30 IST