పూర్తిగా అందని రేషన్‌

ABN , First Publish Date - 2021-03-22T04:57:48+05:30 IST

రేషన్‌ సరుకుల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త (మొబైల్‌ డిస్ర్టిబ్యూషన్‌ యూనిట్‌)) విధానంతో కార్డుదారులకు సరుకులు పూర్తి స్థాయిలో అందలేదు

పూర్తిగా అందని రేషన్‌
నిరీక్షిస్తున్న లబ్ధిదారులు(ఫైల్‌)

 20తో ముగిసిన గడువు ఫ ఆందోళనలో లబ్ధిదారులు ఫ మరో 6 రోజులు కొనసాగించాలని వేడుకోలు

బుచ్చిరెడ్డిపాళెం, మార్చి21: రేషన్‌ సరుకుల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త (మొబైల్‌ డిస్ర్టిబ్యూషన్‌ యూనిట్‌)) విధానంతో కార్డుదారులకు సరుకులు పూర్తి స్థాయిలో అందలేదు. దీంతో రేషన్‌ బియ్యంపైనే ఆధారపడి బతికే రెక్కాడితే కాని డొక్కాడని పేదలు, నిరుపేదలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.   మండలంలో మొత్తం 37 రేషన్‌ దుకాణాల పరిధిలో 23, 516 కార్డుదారులున్నారు. ఒక్కో దుకాణానికి ఒక వాహనం చొప్పున ఉండాలి. మండలానికి మొత్తం 14 వాహనాలు మంజూరు కాగా వాటిలోనూ ఇద్దరు వాహనదారులు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. దాంతో సరుకుల పంపిణీ సక్రమంగా జరగలేదు.

7 రోజులు ఆలస్యంగా పంపిణీ ప్రారంభం

ఈనెల 6నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఏడు రోజులు ఆలస్యంగా ఈనెల 13న ప్రారంభించి 20 వరకు పంపిణీ చేశారు. మండలంలో ఒకటి రెండు మినహా మిగతా షాపుల్లో 30 నుంచి 50శాతం మేరకే సరుకులు  అందించారు. అప్పటికే సర్వర్లు పని చేయక అవస్థలు ఎదుర్కొన్న రేషన్‌ దారులు సరుకుల కోసం నిరీక్షించలేక వెనుదిరిగారు. ఈనెల 21న కూడా కొంతమందికి రేషన్‌ సరుకులు పంపిణీ చేశారు. సోమవారం నుంచి ఇక సరుకులు ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది. వారం రోజులు ఆలస్యంగా  పంపిణీని ప్రారంభించి సాధారణ గడువుతో పంపిణీకి స్వస్తి పలకడం ఎంత వరకు న్యాయమని రేషన్‌ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంపై తహసీల్దారు షఫీమాలిక్‌ను వివరణ కోరగా ఒక్క దుకాణానికి ఒక్క వాహనం  ఉండాలి. పలు చోట్ల మూడు దకాణాలకు ఒక వాహనం సరుకులు పంపిణీ చేస్తుండడంతో ఆలస్యమైంది.

దుకాణాల్లోనే కాటా

ఎండీయూ (మొబైల్‌ డిస్ర్టిబ్యూషన్‌ యూనిట్‌) ద్వారానే ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ మండలంలో వాహనాల్లో తూకం మిషన్లు పనిచేయలేదని కొంతమంది, సర్వర్లు పనిచేయడంలేదని మరికొంతమంది, వాహనాలు లేవని ఇంకొందరు ఇలా మండలంలో పలువురు రేషన్‌ దుకాణాదారులు ఇంటింటికీ రేషన్‌ పంపిణీ  విధానానికి టాటా చెప్పి దుకాణాలల్లోనే కాటా ఏర్పాటు చేసి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. గత నెలతోపాటు ఈనెల కూడా పూర్తి స్తాయిలో పంపిణీ  చేయక అవస్థలు ఎదుర్కొంటున్నారు. సరుకులు రానివారంతా  కూలినాలి చేసుకునే వారే. అందువల్ల మరో 6రోజులు గడువు పెంపుతో పూర్తి స్థాయిలో రేషన్‌ సరు కులు పంపిణీ చేయాలని రేషన్‌ దారులు కోరుతున్నారు.
Updated Date - 2021-03-22T04:57:48+05:30 IST