రైతు దగా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-07-09T03:23:48+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేయాల్పింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా ఉత్సవాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు.

రైతు దగా ఉత్సవాలు
రైతులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల 

వెంకటగిరి, జూలై 9: వైసీపీ ప్రభుత్వం చేయాల్పింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా ఉత్సవాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు. గురువారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రైతు దగా దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పాపమాంబాపురంలో ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ  రైతులను నిలువుదోపిడీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, రైతు దినోత్సవానికి సన్నాహాలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించని ప్రభుత్వానికి రైతు దినోత్సవం చేయడానికి అర్హత లేదన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతుల సంక్షేమం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.  కరోనా విపత్తులో కూడా  ప్రభుత్వం రైతులకు ఎటువంటి సాయం అందించక పోవడం బాధాకరమన్నారు. జగన్‌ ప్రభుత్వం  రైతులకు ఏమీ చేయక పోగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే యోచన చేయడం రైతుల మెడకు ఉరితాడు బిగించినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర, రైతు ఉత్పతులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు పలువురు రైతులు జగన్‌ పాలనలో రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలంరెడ్డి వెంకటరెడ్డి, పులికొల్లు రాజేశ్వరరావు, పప్పు చంద్రమౌళిరెడ్డి, పునుగోటి విశ్వనాథనాయుడు కేవీకే ప్రసాద్‌ నాయుడు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-09T03:23:48+05:30 IST