సా....గుతున్న ఆధునికీకరణ పనులు!

ABN , First Publish Date - 2021-03-25T03:10:23+05:30 IST

కావలి రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

సా....గుతున్న ఆధునికీకరణ పనులు!
నూతన భవనంలోకి వెళ్లే దారిలో జరుగుతున్న పనులు

రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల ఇక్కట్లు

కావలి, మార్చి 24: కావలి రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతుండటంతో  ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్టేషన్‌లోకి వెళ్లే పాత మార్గం పూర్తిగా మూసేయడం, కొత్త మార్గం ఇంకా నిర్మాణం పూర్తికాక పోవటంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వెళ్లాలన్నా రైలు దిగి రావాలన్నా ఇబ్బందులు తప్పటం లేదు. గతంలో ఉన్న రైల్వే పాత టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌, రిజర్వేషన్‌ కౌంటర్‌ భవనాలను పూర్తిగా తొలగించి వాటిని నిర్మాణంలో ఉన్న కొత్త భవనంలోకి మార్చటంతో ఆ భవనంలోకి వెళ్లేందుకు మార్గం లేక  ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. రైల్వే టికెట్‌లు రిజర్వేషన్‌ చేయించుకుని రైలు వచ్చే సమయానికి స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు స్టేషన్‌ ముఖద్వారం నుంచి స్టేషన్‌లోకి ఎటు పోవాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. కనీసం పంయ్రాణికుల సౌకర్యార్థం లోపలకు వెళ్లే మార్గం చూపే తాత్కాలిక బోర్డులు కూడా రైల్వే అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో హడావుడిగా రైలు సమయానికి స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు ఫ్లాట్‌ ఫారం మీదకు వెళ్లే దారి రైలు ఆగే ప్రదేశం తెలుసుకునే లోపు ఆ రైలు కదిలిపోతుండటంతో రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులు ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది.

ఫ్లాట్‌ఫారంపై తప్పని కష్టాలు

ప్లాట్‌ ఫారంపై ఇంకా బోగీలు ఆగే ప్రదేశాల డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో రైల్వేస్టేషన్‌ ప్రవేశ మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్లాట్‌ఫారం మీదకు వెళ్లిన ప్రయాణికులకు అక్కడ తాము ఎక్కాల్సిన బోగీ ఎక్కడకు వస్తుందో తెలియక పరుగులు తీయాల్సి వస్తుంది. రైల్వే అధికారులు రైలు వచ్చే ముందు మైక్‌ ద్వారా ఇంజన్‌ తర్వాత నుంచి వరుసగా వచ్చే బోగీలను అనౌన్స్‌ చేస్తున్నారు. అది సక్రమంగా విననివారు, విన్నా అర్థం కాని వారు రైలులో తమ బోగీ ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైలులో బోగీలు కూడా వరుసక్రమం ఒక సారి ముందుకు మరొక సారి వెనుకకు ఉంటుంది.   సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్‌క్లాస్‌ ఏసీ బోగీలు విజయవాడ వైపు వెళ్లేటప్పుడు ఇంజన్‌ తర్వాత ఉంటాయి. అదే సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో అదే థర్డ్‌క్లాస్‌ ఏసీ బోగీలు ఇటీవల వెనుక వైపుకు మార్చారు. స్టేషన్‌కు వెళ్లిన ప్రయాణికులు అనౌన్స్‌మెంట్‌ కన్నా ముందే ముందు వైపునకు వెళ్లారు. బండి వచ్చేముందు అనౌన్స్‌మెంట్‌లో అవి వెనుక ఉన్నట్లు చెప్పడంతో ప్రయాణికులు తమ లగేజీతో వెనుకకు వెళ్లే లోపే బండి కదలడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే ప్లాట్‌ఫారంపై కూడా మరమ్మతులు చేస్తూ కాలువలు తీసు ఉండటంతో హడావుడిగా వెనుకకు ముందుకు పరుగులు తీయాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేఅధికారులు స్పందించి రైల్వే స్టేషన్‌లో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.Updated Date - 2021-03-25T03:10:23+05:30 IST