ప్రాణాలు తీస్తున్న ‘ప్లాస్టిక్‌’

ABN , First Publish Date - 2021-10-08T05:29:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం 50 మైక్రాన్ల కన్నా ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులివ్వగా తాజాగా 75 మైక్రాన్ల కన్నా ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని మాత్రమే అనుమతించింది.

ప్రాణాలు తీస్తున్న ‘ప్లాస్టిక్‌’

మానవాళిపై కార్సినోజెనిక్‌ పడగ

కేన్సర్‌ కారకమవుతున్న కవర్లు 

వందల ఏళ్లు కాలుష్యం 

నెల్లూరులో మహా ఉద్యమానికి ప్రతిజ్ఞ

సూళ్లూరుపేట, ఆత్మకూరు, కావలిలో కానరాని అమలు 


ప్లాస్టిక్‌.... ప్లాస్టిక్‌.... ప్లాస్టిక్‌....! మానవాళిని ప్రాణాంతక ముప్పులోకి నెట్టేస్తున్న మహమ్మారి. ప్లాస్టిక్‌ కవర్ల వాడకం నిత్య జీవనంలో భాగమై పక్కనే ఉండే శత్రువు గా మారింది. వందేళ్లైన మట్టిలో కుళ్లకుండా కాలుష్య కోరలు చాస్తున్న ప్లాస్టిక్‌ కవర్లు మనిషి కేన్సర్‌ వ్యాధి బారినపడటానికి ప్రత్యక్ష కారణమవుతున్నాయి. అటు పశువుల్లోనూ జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని నెల్లూరులో నిషేధించారు. ఈ మహా ఉద్యమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి యంత్రాంగం ప్రతిజ్ఞ పూనారు. నిషేధిత కవర్లు వినియోగిస్తే రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా, కేసుల నమోదుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని నాయుడుపేట పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపై నిషేధం ఇప్పటికే అమలవుతుండగా గూడూరులో ఈ నెల 16 నుంచి అమలు చేయనున్నారు. అయితే  సూళ్లూరుపేట, ఆత్మకూరు, కావలి వంటి పట్టణాల్లో మాత్రం ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

 

నెల్లూరు (సిటీ), అక్టోబరు 7 : కేంద్ర ప్రభుత్వం 50 మైక్రాన్ల కన్నా ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులివ్వగా తాజాగా 75 మైక్రాన్ల కన్నా ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని మాత్రమే అనుమతించింది. దీని అమలు బాధ్యతను కేంద్ర కాలుష్య నివారణ బోర్డు (సీపీసీబీ)కి అప్పగించింది. అయితే సమాజంలో 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన కవర్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఆ కవర్లలో వేడిగా ఉండే ఆహారపదార్థాలు పోయడం వల్ల ఆ కవర్ల వాడకానికి వినియోగించే పెట్రోకెమికల్‌ ఆహారపదార్థాల్లోకి వెళ్లి వాటి నుంచి శరీరంలోకి ప్రవేశించి కార్సినోజెనిక్‌ అనే కేన్సర్‌ కారక రసాయనాన్ని విడుదల చేస్తోంది. వంద మంది కేన్సర్‌ రోగుల్లో 30 మందికి ఆ వ్యాధి సోకడానికి కారణం ఇదే కావడం గమనార్హం. అంతేకాదు ప్లాస్టిక్‌ కవర్లను దహనం చేసేటప్పుడు వెలువడే ప్రమాదకర రసాయన వాయువులు చర్మ, ఊపిరితిత్తుల రోగాలను కలిగించడమేకాక  రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మానవుల తప్పిదాలకు అమాయక మూగజీవాలు బలవుతున్నాయి. రోడ్లపైన, చెత్త కుండీల్లోని ఆహారంతోపాటు ప్లాస్టిక్‌ కవర్లను తినడంతో పెద్ద సంఖ్యలో పశువులు మృత్యువాతపడుతున్నాయి. పశువుల శరీరంలో జీర్ణశక్తికి దోహదపడే మైక్రోఫ్లోరా అనే స్నేహపూర్వక సూక్ష్మజీవుల మనుగడపై ప్లాస్టిక్‌ కవర్లు ప్రభావం చూపడం వల్ల పశువులు క్రమేణ మరణానికి చేరువ అవుతున్నాయి.


ప్రత్యామ్నాయమే మేలు... 

ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించి అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే మానవజాతితోపాటు పర్యావరణం, మూగజీవాలకు మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వస్త్ర సంచులు, నార సంచులు వాడటం ఉత్తమమంటున్నారు. బజారుకు వెళ్లే ప్రతి ఒక్కరు ఇలాంటి జూట్‌ సంచులను వెంట తెచ్చుకుని ప్లాస్టిక్‌ను నివారించాలని మున్సిపల్‌ యంత్రాంతం పిలుపునిచ్చింది. క్లీన్‌ ఏపీ(క్లాప్‌) కార్యక్రమంతోపాటు క్లీన్‌  నెల్లూరు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.


ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి

ప్లాస్టిక్‌ వాడకాన్ని నెల్లూరులో నిషేధించాం. ఇది విజయవంతం కావాలంటే ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకం వల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉంది. ఈ కవర్ల వల్లే కేన్సర్‌ వస్తుందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్‌ రహిత నెల్లూరు కోసం అందరూ కృషి చేయాలి. 

- కే దినేష్‌కుమార్‌, నెల్లూరు కమిషనర్‌ 


మన తప్పిదం వల్ల పశువుల మరణం

మనం వాడే ప్లాస్టిక్‌ కవర్ల వల్ల పశువులు మరణిస్తున్నాయి. పశువుల పోస్టుమార్టంలో ప్లాస్టిక్‌ కవర్లు తరుచూ కనపడుతున్నాయి. ప్రజలు ఆలోచించి ప్లాస్టిక్‌ కవర్ల నిషేధానికి ముందడుగు వేయాలి. 

- జానా చైతన్యకిషోర్‌, ఏడీడీఎల్‌, ఏడీ   

 

ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమ సీజ్‌ 

రెండు రెస్టారెంట్ల మూత 

నెల్లూరు (సిటీ), అక్టోబరు 7 : నిషేధిత ప్లాస్టిక్‌ కవర్ల తయారీ, వినియోగంపై నెల్లూరు కార్పొరేషన్‌ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌, ఎంహెచ్‌వో వెంకటరమణయ్య బృందం మైపాడు రహదారి వెంబడి ఆకస్మిక దాడులు నిర్వహించింది. కవర్లు తయారు చేసే పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో పరిశ్రమను సీజ్‌ చేశారు. అనంతరం రెండు రెస్టారెంట్లపై దాడులు నిర్వహించి అక్కడ కూడా నిషేధిత కవర్లు వినియోగిస్తుండటంతో వాటిని మూతేశారు. ఆ రెస్టారెంట్లలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం, పారిశుధ్యంలేమిని గుర్తించామని కమిషనర్‌ తెలిపారు.  

Updated Date - 2021-10-08T05:29:46+05:30 IST