అనిల్‌ మృతదేహానికి పోస్టుమార్టం

ABN , First Publish Date - 2021-02-06T04:54:25+05:30 IST

సూళ్లూరుపేట కోళ్లమిట్టలో గురువారం రాత్రి హత్యకు గురైన నిమ్మల అనిల్‌కుమార్‌ (22) మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం పూర్తయింది.

అనిల్‌ మృతదేహానికి పోస్టుమార్టం


పోలీస్‌ స్టేషన్‌ ముందు బంధువుల ఆందోళన 

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 5 : సూళ్లూరుపేట కోళ్లమిట్టలో గురువారం రాత్రి హత్యకు గురైన నిమ్మల అనిల్‌కుమార్‌ (22) మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం పోలీసులు బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. షటిల్‌ కోర్టు వద్ద బ్యాట్‌ కోసం జరిగిన గొడవ కారణంగా నిమ్మల అనిల్‌కుమార్‌ను ఇంటర్‌ చదివే ఎం. పవన్‌కుమార్‌ (20), పెయింటింగ్‌ పనిచేసే అతని అన్న సాయి (23)తో కలసి దాడి చేసి కత్తితో పొడవడంతో అనిల్‌కుమార్‌ మృతి చెందిన విషయం విదితమే. పోలీసులు నిందితులైన అన్నదమ్ములు పవన్‌కుమార్‌, సాయిలను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 

పోలీస్‌ స్టేషన్‌ వద్ద హతుడి బంధువుల ఆందోళన

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అనిల్‌కుమార్‌ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగా అతని బంధువులు, కోళ్లమిట్టకు చెందిన పలువురు  పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. నిందితుడు పవన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాలర్‌ ఎగరేస్తూ ఉన్నాడని ఆగ్రహిస్తూ  కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో సీఐ, ఎస్‌ఐలు స్టేషన్‌లో లేకపోవడంతో కొందరు కానిస్టేబుళ్లు వారికి నచ్చచెప్పి పంపించారు. 


Updated Date - 2021-02-06T04:54:25+05:30 IST