పొర్లుకట్టల గండ్లకు శాశ్వత మరమ్మతులు
ABN , First Publish Date - 2021-11-27T05:23:28+05:30 IST
పెన్నా వరదకు పొర్లుకట్టకు పడిన భారీ గండ్లను పూడ్చేందుకు శాశ్వత మరమ్మతులు చేపడతామని జేసీ హరేందిర ప్రసాద్ అన్నారు.

జేసీ హరేందిర ప్రసాద్
బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 26: పెన్నా వరదకు పొర్లుకట్టకు పడిన భారీ గండ్లను పూడ్చేందుకు శాశ్వత మరమ్మతులు చేపడతామని జేసీ హరేందిర ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జొన్నవాడలో పొర్లుకట్టకు పడిన గండ్లు, దెబ్బతిన్న పొలాలు నీటిపారుదల, పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నా నదికి మళ్లీ 3లక్షలకు పైగా వరద నీరు వచ్చినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్ర బృందం సహకారంతో పొర్లుకట్టలకు పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. ఇసుక రీచ్ వల్ల సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోందన్నారు. ఈ మేరకు పూర్తిగా పరిశీలించి రీచ్‌ను కూడా ఆపివేయడం జరుగుతుందని తెలిపారు. వరద బాధితుల ప్రాణాలు కాపాడిన పెనుబల్లి, జొన్నవాడ తిప్పలో గ్రావెల్ తవ్వకాల విషయంపై ప్రశ్నించగా.. ప్రస్తుతం వరదల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో తిప్ప నుంచి గ్రావెల్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వరద ముంపునకు గురైన గ్రామాల్లో కొంతమందికే సాయం అందిస్తున్నారని, మండలంలో ఐదువేల మందికిపైగా వరద బాధితులున్నట్లు జేసీకి తెలిపారు. అయితే మరోసారి ఆర్డీవో, తహసీల్దారుతో సర్వే చేసి పూర్తి స్థాయిలో అందరికీ సాయమందిస్తామని తెలిపారు. జేసీ వెంట ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్, డీఈ మధు, పంచాయతీరాజ్ అధికారులు, స్థానిక వీఆర్వో మహేష్, రైతులు వున్నారు.
మూగజీవాలకు పరిహారం మంజూరు
వరదల కారణంగా మృత్యువాతపడిన మూగ జీవాలకు మంజూరైన నష్టపరిహారం శుక్రవారం సాయంత్రానికే యజమానుల ఖాతాలకు జమ అవుతాయని జేసీ హరేందిర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని పెనుబల్లి పశువైద్యశాలను పరిశీలించారు. జిల్లా పశుసంవర్దక జేడీ డాక్టర్ బి. మహేశ్వరుడు, బుచ్చి ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ బి. మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు.