కుండీలు తీసేసి... కుప్పలు పెంచేసి!!

ABN , First Publish Date - 2021-03-22T07:44:52+05:30 IST

సుందర సింహపురి... క్లీన్‌ నెల్లూరు... ఈ మాటలు పాలకులు, అధికారుల ప్రకటనలు, వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయి. వీధివీధినా కనిపిస్తున్న చెత్త కుప్పలు వారి పనితీరును, చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి.

కుండీలు తీసేసి...  కుప్పలు పెంచేసి!!
వేదాయపాళెం సెంటర్‌లో డస్ట్‌బిన్లు లేకుండా ఖాళీగా ఉన్న స్టాండు

‘చెత్త’ నగరంగా నెల్లూరు

ఇంటింటా సేకరణ పేరుతో బిన్నులు మాయం

రోడ్లపై పేరుకుపోతున్న వ్యర్థాలు 

ఆచరణకు నోచుకోని ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’

నగర వాసులకు దుర్వాసన, దోమల బెడద



సుందర సింహపురి... క్లీన్‌ నెల్లూరు... ఈ మాటలు పాలకులు, అధికారుల ప్రకటనలు, వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయి. వీధివీధినా కనిపిస్తున్న చెత్త కుప్పలు వారి పనితీరును, చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. వందలాది మంది కార్మికులు, పెద్ద సంఖ్యలో వాహనాలు, యంత్రాలు అందుబాటులో ఉన్నా నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో నగర పాలక సంస్థ సఫలీకృతం కాలేకపోతోంది. ఇక, స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో గుర్తింపు కోసం అధికారులు పడుతున్న ఆరాటం ప్రచార ఆర్భాటం తప్పితే ఆచరణలో స్వచ్ఛత ఎండమావిగా మారుతోంది. ఇళ్ల నుంచే నేరుగా చెత్త సేకరణపై ప్రజలను పూర్తిగా చైతన్యవంతులను చేయకుండా పలుచోట్ల చెత్త కుండీలు తొలగించడంతో నెల్లూరు చెత్త నగరంగా మారుతోంది. ఫలితంగా ప్రజలు నిత్యం దుర్వాసన, దోమల బెడదతో సహజీవనం చేయవలసి వస్తోంది.


నెల్లూరు(సిటీ), మార్చి 21 : స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నుంచే నేరుగా తడి, పొడి చెత్తను సేకరించడానికి కొన్ని నెలల క్రితం నగర పాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రజలు తడి, పొడి చెత్తను విడివిడిగా కార్పొరేషన్‌ చెత్త వాహనాలకు ఇవ్వాలంటూ ప్రచారం చేసిన నగర పాలక సంస్థ అధికారులు అందులో భాగంగా వీధులు, కూడళ్లలోని డస్ట్‌బిన్నులను తొలగించారు. కానీ ఇంటింటికి పారిశుధ్య సిబ్బంది సక్రమంగా రావడం లేదు. ఇటు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు సిబ్బంది రాకపోవడం, అటు చెత్తకుండీలు లేకపోవడంతో ప్రజలు గత్యంతరం లేక రోడ్లపైనే వ్యర్థాలు పోస్తున్నారు. మరికొన్ని చోట్ల దెబ్బతిన్న కుండీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్కడ కూడా చెత్త కుప్పలు పేరుకుంటున్నాయి. కాగా, నిత్యం సుమారు 300 టన్నుల చెత్తను నగర వీధుల నుంచి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నామని అధికారులు చెబుతుండగా ఇంకా భారీ స్థాయిలో రోడ్లపై వ్యర్థాలు ఎలా కనిపిస్తున్నాయని సగటు నగర వాసులు ప్రశ్నిస్తున్నారు.


బిన్‌ రహితమంటే ఇదేనా? 

నెల్లూరును డస్ట్‌బిన్‌ రహిత నగరంగా మార్చాలని ఇటీవల కార్పొరేషన్‌ అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది మంచి ఉద్దేశమే అయినా ఇళ్ల నుంచి నేరుగా చెత్త సేకరణకు ప్రజలు పూర్తిగా అలవాటు పడకముందే ఉన్న డస్ట్‌బిన్లను తీసేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఇళ్ల నుంచి చెత్త సేకరణను సమర్ధంగా అమలుచేయకపోవడంతో వ్యర్థాలు రోడ్డెక్కుతున్నాయి.



ఫిర్యాదు చేయడం వల్ల తీసేసుంటారు

- వెంకట రమణయ్య, ఎంహెచ్‌వో 

డస్ట్‌బిన్‌ ఉండి తీసేయడం జరగదు. ఆ ప్రాంతవాసులు తమకు ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేసి ఉంటే తీసేసుంటారు. వాస్తవాలు తెలుసుకుని అవసరమైన మేరకు చెత్త కుండీలు ఏర్పాటు చేస్తాం. ప్రజలెవరూ రోడ్లపై చెత్త వేయవద్దని మనవి. ఇళ్ల వద్దకు వచ్చే వాహనాలకు వ్యర్థాలను అందించాలి. 





Updated Date - 2021-03-22T07:44:52+05:30 IST