పొదలకూరును వణికిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-24T04:14:33+05:30 IST

మండలంలో వరుసగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పొదలకూరును వణికిస్తున్న కరోనా
పొదలకూరులో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌ రమేష్‌

రోజురోజుకు పెరుగుతున్న కేసులు 

ఆందోళనలో ప్రజలు


పొదలకూరు(రూరల్‌), ఏప్రిల్‌ 23 : మండలంలో వరుసగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు శుక్రవారం రెండు మరణాలు సంభవించడంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు.   తాజాగా శుక్రవారం ఐదు కేసులు వచ్చాయి. దీంతో మండలంలో మొత్తం 74 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో తహసీల్దారు స్వాతి, పొదలకూరు సీఐ గంగాధర్‌రావు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ రమేష్‌, ఎంపీడీవో సుస్మితారెడ్డిలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించారు. అలాగే శుక్రవారం నుంచి పట్టణంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని, ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి అన్ని దుకాణాలు మూతపడ్డాయి. మహమ్మదాపురం వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌ శుక్రవారం పొదలకూరు సబ్‌ సెంటర్లో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. శ్యాంపిల్స్‌ను ఏసీఎస్‌ఆర్‌ వైద్య కళాశాలలోని మైక్రో బయోలజీ ల్యాబ్‌కు పంపించారు.  


స్వచ్ఛందంగా దుకాణాలు మూసేయండి : ఎస్‌ఐ రహీంరెడ్డి

పొదలకూరు : పట్టణంలోని దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేయాలని పొదలకూరు ఎస్‌ఐ రహీంరెడ్డి అన్నారు. జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృభిస్తున్న నేపథ్యంలో వ్యాపారులను, ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామాల నుంచి వచ్చే వారు, పట్టణంలోని ప్రజలు ఒంటి గంటలోపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని పేర్కొన్నారు.  అలాగే వ్యాపారులు కూడా దుకాణాల్లో సామాజిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్‌ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  

 

ప్రజల్లో నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనం!!

ముత్తుకూరు : అధికారుల ఉరుకులు పరుగులు.. ఆరోగ్య సిబ్బంది హడావిడి.. పోలీసుల బందోబస్తు.. ఇదంతా సరిగ్గా ఏడాది కిందట మండలంలోని మల్లూరులో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యిందని తెలిసిన వెంటనే చోటుచేసుకున్న పరిణామాలు. ఊరందరికీ కొవిడ్‌ పరీక్షలు చేయించడం.. గ్రామంలో నుంచి ఎవరినీ బయటకు రాకుండా చూడడం వంటి చర్యలు చేపట్టారు. ప్రజలు సైతం మాస్కు లేకుండా బయటకు రాకపోవడం.. శానిటైజర్ల వాడకం.. పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు.  మరి నేడు సెకండ్‌ వేవ్‌ ఉధృతితో మండలంలో 300 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అయినా ప్రజల్లో నిర్లక్ష్యం.. అధికారుల్లో ఉదాసీనత వీడడం లేదు. గత ఇరవై రోజులుగా కరోనా సెకండ్‌ వేవ్‌ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. ప్రతి రోజూ మండలంలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే తాము చేసేదేముందిలే అనుకుని అధికారులు కూడా నామమాత్ర చర్యలకు పరిమతమవడం గమనార్హం. కేసులు అధికంగా ఉన్న గ్రామాల్లో సైతం పారిశుధ్యం, ఇతర జాగ్రత్త చర్యలు కంటితుడుపుగానే ఉన్నాయి. కరోనా కట్టడికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా ఉన్నతాధికారుల ప్రకటనలు  క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు.  వారం రోజులుగా మండలంలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నా ఇప్పటివరకు మండల స్థాయి యంత్రాంగం పరిస్థితులను అదుపులోకి తెచ్చే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అసలే పారిశ్రామిక ప్రాంతమైన ముత్తుకూరు మండలంలో కనీస ఆంక్షలు విధించకుంటే, పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి నిబంధనలు అమలయ్యేలా అంక్షలు విధించడం, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే కరోనా ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉంది. 

  

కరోనాపై పోలీసుల ప్రచారం 

ఇందుకూరుపేట, ఏప్రిల్‌ 23 : మండలంలో కరోనా  విజృంభిస్తుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు సరికొత్త ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం అనేక గ్రామాల్లో పోలీస్‌ సిబ్బంది మోటార్‌ సైకిళ్లలో మైక్‌లతో అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని వారు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.   అంతేకాకుండా మాస్క్‌ లేకుంటే జరిమానా విధిస్తామని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుండటం కూడా ప్రజల్లో కొంత వరకు చైతన్యం కలుగుతుంది. ఇటీవల కాలంలో రోజుకి 15కి పైగా  కరోనా కేసులు మండలంలో నమోదు కావడంతో ప్రజల్లో కూడా ఆందోళన తలెత్తుతుంది. మండలంలో ఆకుకూరలు, కాయగూరలు, చేపలు, రొయ్యల పరిశ్రమల కార్మికులు అధిక సంఖ్యలో ఉండడం, నిత్య ప్రయాణాలతో ఈ కొవిడ్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. దీంతో పోలీసులు ఏఎస్‌ఐ శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ఈ  ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ప్రజలు కూడా హర్షం వెలిబుచ్చారు.  



Updated Date - 2021-04-24T04:14:33+05:30 IST