న్యాయం చేయండి.. ప్లీజ్‌ !

ABN , First Publish Date - 2021-01-21T02:51:01+05:30 IST

అత్తవారింట్లో తనను, భర్త, అత్తమామలు పట్టించుకోవడం లేదని, ఎందుకిలా చేస్తున్నారని ప్ర

న్యాయం చేయండి.. ప్లీజ్‌ !
అత్తగారింట్లో చిన్నారితో వివాహిత

 చంటిబిడ్డతో కలిసి వివాహిత వేడుకోలు

సూళ్లూరుపేట, జనవరి 20 : అత్తవారింట్లో తనను, భర్త, అత్తమామలు పట్టించుకోవడం లేదని, ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే, నీకు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారని చంటిబిడ్డతో కలిసి ఓ వివాహిత బావురమంది. ఆంధ్రజ్యోతిని ఆశ్రయించి, తనగోడును వెళ్లబోసుకుంది. సూళ్లూరుపేట బాపూజీకాలనీకి చెందిన ఎద్దల రూపేష్‌కుమార్‌(31)కు 2019 అక్టోబరు 19న రాపూరుకు చెందిన యువతి(29)తో పెళ్లి జరిగింది. నెల్లూరు ఏకే నగర్‌ పోస్టాఫీసులో పనిచేసే రూపేష్‌కుమార్‌కు పెళ్లి సందర్భంగా యువతి తల్లిదండ్రులు  రూ.5 లక్షల కట్నం, 5 సవర్ల బంగారంతోపాటు ఇంటికి కావాల్సిన సామగ్రి కొనిచ్చారు. కొద్ది రోజులు కాపురం సజావుగా సాగింది. ఆ తరువాత  తన భర్త నిత్యం మరో యువతితో ఫోన్‌లో మాట్లాడుతూ, చాటింగ్‌ చేస్తూ ఉండేవాడని భార్య పేర్కొంది. ఇదేమిటని తాను ప్రశ్నించడంతో గొడవలు ప్రారంభమయ్యా యని ఆమె తెలిపింది. 

ఈ నేపథ్యంలో తాను గర్భవతిని అయ్యానని, అయినా అతడిలో మార్పురాలేదని వాపోయింది. ఓ రోజు తాను గట్టిగా నిలదీయడంతో తనను చిత్రహింసలకు గురిచేశాడని పేర్కొంది. దిక్కుతోచక తాను 100 నెంబరుకు ఫోన్‌ చేయడంతో ఎస్‌ఐ వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లి  పెద్దల సమక్షంలో తన భర్త,  అత్తమామలతో కౌన్సెలింగ్‌ చేశారని చెప్పింది. ఈ నేపథ్యంలో రెండు వారాల్లో నెల్లూరులో ఇల్లు చూసుకొని తనను కాపురానికి తీసుకువెళ్తానని భర్త అంగీకరించాడని ఆమె తెలిపింది. దాంతో రాపూరులోని తన అమ్మగారింటికి తల్లిదండ్రులు తీసుకెళ్లారని చెప్పింది. అప్పటి నుంచి భర్త, అత్తామామలు తనను పట్టించుకోలేదని వాపోయింది.  తనకు గూడూరులో కాన్పు జరిగి ఆడపిల్ల పుట్టిందని అత్తామామలకు తెలపగా, మామ  వచ్చి చూసి వెళ్లిపోయాడని చెప్పింది. అప్పటి నుంచి భర్త బిడ్డ ముఖం కూడా చూడలేదని పేర్కొంది. చివరకు గత డిసెంబరు 25వ తేదీ  మా అమ్మతో కలిసి బిడ్డను ఎత్తుకొని అత్తగారి ఇంటికి వెళితే ఎవరూ మాట్లాడకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారని చెప్పింది. ఇంట్లో గ్యాస్‌, మోటారు  కనెక్షన్‌ తీసివేశారని తెలిపింది. అంతేకాక  విడాకులు కావాలని తన భర్త నోటీసు పంపించాడని పేర్కొంది. ఇప్పటికైనా దిశ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు పట్టించుకొని తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది.


Updated Date - 2021-01-21T02:51:01+05:30 IST