‘నూతన’ వేడుకలకు అనుమతుల్లేవ్‌!

ABN , First Publish Date - 2021-12-31T07:02:20+05:30 IST

నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తేల్చి చెప్పేశారు.

‘నూతన’ వేడుకలకు అనుమతుల్లేవ్‌!

నేటి రాత్రి పోలీసులంతా రోడ్లపైనే

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు


 నెల్లూరు (క్రైం), డిసెంబరు 30 : నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తేల్చి చెప్పేశారు. 31వ తేదీ రాత్రి నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇళ్ల వద్దే వేడుకలు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. యువకులు ఇప్పటికే పలు పార్టీలు, హంగామాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టే పోలీసులు సైతం ఏ సెంటర్లలో ఎంతమంది విధులు నిర్వహించాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 

గుంపులు గుంపులుగా చేరి వాహనాల హారన్‌ మోగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. బాణసంచా పేల్చకూడదు.

31వ తేది రాత్రి రోడ్లపై కేక్‌ కటింగ్‌లు చేసి ఎవరినీ ఇబ్బంది కలింగించ కూడదు.

రాత్రి 10 గంటలకల్లా వ్యాపార సముదాయాలన్నీ మూసివేయాలి.

హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు ఇతర సంస్థల్లో జరిగే కార్యక్రమాలకు అనుమతులు లేవు. బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. నిర్ధేశించిన సమయం వరకే మద్యం విక్రయించాలి.


తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి :  విజయరావు, ఎస్పీ 

కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో ఇళ్ల వద్దనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాము. 31వ తేదీ రాత్రి పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్లపైనే ఉంటుంది. మద్యం సేవించి వాహనాలు నడిపినా, అధిక శబ్దాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాము.  తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-12-31T07:02:20+05:30 IST