మంత్రి అనిల్‌ రూ.వందకోట్ల ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

నదులను రక్షించాల్సిన..

మంత్రి అనిల్‌ రూ.వందకోట్ల ఇసుక దోపిడీ

పెన్నా నదిలో 30 అడుగుల మేర తవ్వకాలు

టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి

పార్క్‌ గ్యాంగ్‌ దోపిడీలను అరికట్టాలని ధర్నా


నెల్లూరు: నదులను రక్షించాల్సిన మంత్రి అనిల్‌ తన అనుచరులతో పెన్నానదిలో దాదాపు రూ.వంద కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పెర్కొన్నారు. నెల్లూరు భగతసింగ్‌ కాలనీ సమీపంలోని నూతన పెన్నా బ్రిడ్జ్‌ వద్ద జరుగుతన్న ఇసుక తవ్వకాలను ఆపాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు, స్థానికలతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో పార్క్‌ గ్యాంగ్‌ చేస్తున్న దోపిడీని జిల్లా అధికారులు అరికట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి అనీల్‌ అనుచరులు పెన్నానదిలోని ఇసుకను తవ్వేయడం వల్ల దాదాపు వందకోట్ల మేర ఇసుక  దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.


ఇసుక దొపిడీకి పాల్పడిన మంత్రి అనీల్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు. ఇప్పటికైనా దోపిడీదారులపై కేసులు నమోదు చేయకపోతే అందరినీ కోర్టులకు లాగుతామని హెచ్చరించారు. తాము వస్తున్నామని తెలుసుకొన్న అక్రమార్కులు ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లు, ట్రాక్టర్లను తరలించేశారని అన్నారు. ఈ ఆందోళనలో టీడీపీ నాయకులు జహీర్‌, మధు, కప్పిర శ్రీనివాసులు, రేవతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST