ముగిసిన నామినేషన్ల ఘట్టం

ABN , First Publish Date - 2021-02-01T06:04:29+05:30 IST

జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు ఆదివారం నామినేషన్ల ఘట్టం ముగిసింది.

ముగిసిన నామినేషన్ల ఘట్టం
జలదంకిలో నామినేషన్‌ కేంద్రం వద్ద గుమిగూడిన అభ్యర్థులు

నేడు పరిశీలన 

4న ఉపసంహరణ

చివరి రోజున 3100  నామినేషన్లు


నెల్లూరు(జడ్పీ), జనవరి 31 : జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు  ఆదివారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఈనెల 9న మొదటగా కావలి రెవెన్యూ డివిజన్‌కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఈనెల 29న ప్రారంభమై ఆదివారం ముగిసింది. మూడురోజులపాటు కావలి డివిజన్‌లోని 9 మండలాల పరిధిలోని 163 పంచాయతీలు, 1566 వార్డులకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆ వార్డులకు సంబంధించి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు నామినేషన్లు  స్వల్పంగానే నమోదయ్యాయి. 163 సర్పంచు స్థానాలకు కేవలం  27 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1566 వార్డులకు 46 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండోరోజు శనివారం అభ్యర్థులు  భారీగా నామిషన్లను వేశారు. పంచాయతీలకు సంబంధించి 392 నామినేషన్లు దాఖలు కావడంతో మొత్తం 419 నామినేషన్లు  రెండురోజులపాటు దాఖలయ్యాయి.  అలాగే వార్డులకు రెండోరోజు 1093 నామినేషన్లు దాఖలు కాగా, రెండురోజులకు కలిపి 1139 నామినేషన్లు దాఖలయ్యాయి. 

చివరి రోజు కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజున పంచాయతీలకు  540 నామినేషన్లు వేయగా, వార్డులకు 2785 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో జిల్లాలోని పంచాయతీలకు 959 నామినేషన్లు, వార్డులకు 3923 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం సాయంత్రం 5గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది. అయితే రాత్రి వరకు అభ్యర్థులు క్యూలో ఉండడంతో నామినేషన్ల  స్వీకరణ ఆలస్యమైంది. 


నేడు పరిశీలన


 సోమవారం నామినేషన్ల పరిశీలనను అధికారులు చేపట్టనున్నారు. అలాగే ఈనెల 2న నామినేషన్లలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈనెల 4న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదేరోజు మూడు గంటల వరకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అనంతరం పంచాయతీలు, వార్డుల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. 


Updated Date - 2021-02-01T06:04:29+05:30 IST