నాడు రూ.80లక్షలు నేడు 8 లక్షలు

ABN , First Publish Date - 2021-05-22T03:54:44+05:30 IST

ఓ పక్క డీజిల్‌ ధరలు పెరిగి పోతున్నాయి. మరోపక్క ప్రైవేటు వాహనాలతో తీవ్రపోటీ. ఇవి చాలవన్నట్టు కరోనా ప్రభావం.. ఇంకేముంది. ఆర్టీసీ రాబడికి భారీ గండి పడుతోంది.

నాడు రూ.80లక్షలు  నేడు 8 లక్షలు

కరోనాతో ఆర్టీసీకి పడిపోయిన రాబడి

దూరప్రాంత సర్వీసులు రద్దు

కార్మికులకూ షెడ్యూలు కుదింపు


నెల్లూరు(స్టోనహౌస్‌పేట), మే 21 : ఓ పక్క డీజిల్‌ ధరలు పెరిగి పోతున్నాయి. మరోపక్క ప్రైవేటు వాహనాలతో తీవ్రపోటీ. ఇవి చాలవన్నట్టు కరోనా ప్రభావం.. ఇంకేముంది. ఆర్టీసీ రాబడికి భారీ గండి పడుతోంది. గతేడాది లాక్‌డౌనతో కోలుకోలేని దెబ్బ తిన్న  ఆ సంస్థకు రెండవ దశ కర్య్ఫూతో మరో దెబ్బ తగిలింది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకే బస్సులు నడుస్తుండటంతో దూరప్రాంతాల సర్వీసులను రద్దు చేశారు. నెల్లూరు రీజియనకు ఎక్కువ ఆదాయాన్ని తీసుకువచ్చే రూట్లు అయిన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, కడప, తిరుపతి ఇలా దూరప్రాంతాకు వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో రీజియనకు వచ్చే రాబడి పూర్తిగా పడిపోయింది. జిల్లా పరిధిలోని పల్లె, పట్టణాలకు మాత్రమే కొవిడ్‌ నిబంధనల మేరకు అధికారులు బస్సులు నడుపుతున్నారు.

 

రూ.80 లక్షల నుంచి 8లక్షలకు


సాధారణ రోజుల్లో నెల్లూరు రీజియన పరిధిలోని పది ఆర్టీసీ డిపోలలో రోజుకు అద్దె బస్సులతో కలిపి 768 సర్వీసులు నడిపేవారు. వీటిలో 140 సర్వీసులు దూరప్రాంతాకు వెళ్లేవి. రోజుకు రూ.80-90 లక్షల వరకు రాబడి వచ్చేది. అయితే, కర్య్ఫూతో దూరప్రాంత బస్సులను పూర్తిగా ఆపేయడం, సర్వీసులను 90 శాతం తగ్గించడంతో రోజుకు రు.8-9 లక్షల వరకు మాత్రమే రాబడి వస్తోంది. మరోవైపు కార్మికులకూ షెడ్యుల్‌ ప్రకారం డ్యూటీలు వేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి కార్మికులకు విధుల్లోకి వెళుతున్నారు.


వాకాడులో రూ.30వేలే..!


వాకాడు : వాకాడు డిపో పరిధిలో 50 బస్సులు నడుస్తుండగా కొవిడ్‌ ప్రభావంవల్ల 14 సర్వీసులనే నడుపుతున్నారు.  కడప, విజయవాడ, ప్రొద్దుటూరు, నెల్లూరు మీదుగా చెన్నై ప్రాంతాలకు బస్సులను రద్దు చేశారు. నాయుడుపేట, గూడూరు, మల్లాం, నెల్లూరు, ముత్తుకూరు ప్రాంతాలకు మాత్రమే బస్సులు తిప్పుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రయాణికులు బస్సుల్లో ఎక్కడం లేదు. గతంలో రోజుకు రూ.6-7.5 లక్షల వరకు రాబడి వస్తుండగా, ఇప్పుడు రూ.30-35వేలు వరకే వస్తోంది.


రాబడి భాగా తగ్గింది

కర్ఫ్యూ ఉన్నందున బస్సులను పరిమితంగా నడుపుతున్నాం.  బస్సులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి వచ్చేలా చూస్తున్నాం. 

- రమణయ్య, డిపో మేనేజర్‌, వాకాడు

Updated Date - 2021-05-22T03:54:44+05:30 IST