మైనింగ్ మాఫియా డాన్‌ను వదిలం : టీడీపీ
ABN , First Publish Date - 2021-07-09T04:47:18+05:30 IST
సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా డాన్‌ను వదిలే ప్రసక్తే లేదని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు.

వెంకటాచలం, జూలై 8 : సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా డాన్‌ను వదిలే ప్రసక్తే లేదని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆ డాన్‌కు సహకరించే అధికారులు కోర్టు మెట్లు ఎక్కక తప్పదని పేర్కొన్నారు. విరువూరు ఇసుక రీచ్‌లో కోట్లాది రూపాయల ప్రజల సొత్తు లూటీకి గురైతే మాముళ్ల మత్తులో జోగిన అధికారులను సత్కరించాలని వ్యగ్యంగా అన్నారు. ప్రభగిరిపట్నం కొండ, కసుమూరు తిప్పతోపాటు నియోజకవర్గంలోని గుట్టలన్నీ మాయమవుతుంటే కళ్లు మూసుకుని ఉన్న అధికారులకు శాలువాలు కప్పాలా అని ఎద్దేవా చేశారు. పిడతాపోలూరు మట్టి, వల్లూరు చెరువు తువ్వతో అత్యంత నాసిరకంగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కడుతుంటే నిద్ర నటించిన అధికారులకు పూలమాలలు వేయాలని తెలిపారు. సర్వేపల్లి రిజర్వాయర్‌లో రైతుల పేరుతో 8 వేల క్యూబిక్ మీటర్ల మట్టికి అనుమతి తీసుకుని లక్ష క్యూబిక్ మీటర్ల విలువైన గ్రావెల్‌ను పట్టపగలే దోచేస్తే కఠినచర్యలు తీసుకోవాల్సింది పోయి దగ్గరుండి టిప్పర్లు, ప్రొక్లెయిన్లను సాగనంపిన అధికారులకు దండాలు పెట్టాలని ఎద్దేవా చేశారు. మాఫియా డాన్ అవినీతి, అక్రమాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, అక్రమ కేసులు బనాయించినా బెదిరే ప్రసక్తే లేదని, మీ అవినీతి, అక్రమాలను సాగనివ్వబోమని హెచ్చరించారు.
గ్రావెల్ మాఫియాపై చర్యలు తీసుకోండి
సర్వేపల్లి రిజర్వాయర్, కంటేపల్లి, ఈదగాలి గ్రామాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడిన గ్రావెల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ బాబు కోరారు. సర్వేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు, పేదల భూములే లక్ష్యంగా మాఫియా పేట్రేగిపోతుంటే అధికారులు చూసిచూడనట్లుగా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. చర్యలు తీసుకోని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పోలంరెడ్డి ఇందిరారెడ్డి, సాయి, అవినాష్, వంశీ, కృష్ణ తదితరులు ఉన్నారు.