పాత కక్షలతోనే హత్య
ABN , First Publish Date - 2021-02-01T07:36:30+05:30 IST
వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ అబ్బీసాహెబ్ కండ్రిగ అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ కొండూరు సుమన్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని నెల్లూరు రూరల్ డీఎస్పీ వై హరినాథ్‌రెడ్డి తెలిపారు.

చవటపాళెం కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైం), జనవరి 31: వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ అబ్బీసాహెబ్ కండ్రిగ అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ కొండూరు సుమన్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని నెల్లూరు రూరల్ డీఎస్పీ వై హరినాథ్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
అబ్బీసాహెబ్ కండ్రిగ అటవీ ప్రాంతంలో జనవరి 27వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందడంతో వెంకటాచలం సీఐ కే రామకృష్ణ, ఎస్‌ఐ షేక్ కరిముల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. మృతదేహం చిల్లకూరు మండలానికి చెందిన రౌడీషీటర్ కొండూరు సుమన్‌దిగా గుర్తించారు. ఆ తర్వాత జరిపిన విచారణలో ఈ హత్యకు పాతకక్షలే కారణమని తెలుసుకున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేయగా గూడూరు నెలజాలమ్మ వీధికి చెందిన రౌడీషీటర్ దేవెళ్ల జయప్రకాష్‌తో సుమన్‌కు విభేదాలు ఉన్నట్లు తెలిసింది. గతంలో ఓ బారులో జయప్రకాష్, సుమన్ వర్గాలు మద్యం సేవిస్తున్న సమయంలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుమన్ హత్య కేసులో జయప్రకాష్‌పై అనుమానంతో అతని కోసం గాలింపు జరిపారు. ఆదివారం గొలగమూడి రోడ్డులో జయప్రకాష్‌తోపాటు నెల్లూరు గాంధీనగర్‌కు చెందిన రౌడీషీటర్ మహ్మద్ జమీర్, గూడూరు ఇందిరానగర్‌కు చెందిన రౌడీషీటర్ అరవ వినయ్, గూడూరు చవటపాళేనికి చెందిన షేక్ కాలేషా, దుగ్గినబోయిన సాయిశివ, నాయుడుకాలువ కట్టకు చెందిన రౌడీషీటర్ పొంగూరు లక్ష్మీనారాయణ, బాలాయపల్లి మండలం పాకపూడి గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
చంపుతాడన్న భయంతోనే హత్య
సుమన్‌తో తమకున్న పాత కక్షలతో తమను ఎక్కడ చంపుతాడో అన్న భయంతోనే పథకం ప్రకారం హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. మద్యం సేవించేందుకు రమ్మని స్నేహితుల ద్వారా చవటపాళెం అటవీ ప్రాంతానికి పిలిపించి మారణాయుధాలతో హతమార్చారు. ఆ తర్వాత విడవలూరు మండలం ఊటుకూరులో తలదాచుకున్నారు. ఆదివారం చెన్నైకి పరారయ్యేందుకు గొలగమూడి రోడ్డు వద్ద ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయప్రకాష్‌పై గూడూరు పోలీస్ స్టేషన్‌లో 14 కేసులు ఉన్నాయని, మిగిలిన ఆరుగురు కూడా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారని డీఎస్పీ తెలిపారు.